ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల పట్టుదలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రశంసించారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో షర్మిల తనను తాను నిరూపించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎలా పోరాడారో.. షర్మిల కూడా క్షేత్రస్థాయి నుంచి పోరాటాలు చేస్తున్నారు. కానీ రేవంత్ కు ఉన్నంత సపోర్టు ఆమెకు లభించడం లేదు.
షర్మిలకు రేవంత్ ఎందుకు సహకరించడం లేదు?
మాటల వరకు ప్రశంసలు కురిపిస్తున్న రేవంత్, చేతల్లో మాత్రం ఏపీ కాంగ్రెస్కు ఆశించిన స్థాయిలో సహకారం అందించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం అనేది ఏపీ లాంటి రాష్ట్రంలో పార్టీ పుంజుకోవడానికి ఒక గొప్ప అవకాశం. రేవంత్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని, వ్యూహాలను షర్మిలకు తోడుగా నిలిపితే ఫలితాలు వేరేలా ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ పుంజుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు, కేడర్ సమన్వయం వ్యూహాత్మక మద్దతు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి పూర్తిస్థాయి సహకారం అందితే, షర్మిల నేతృత్వంలోని ఏపీ కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోసినట్లవుతుంది.
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నా లభించని సహకారం
పొరుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మద్దతు ఉంటే ఎన్నికల వ్యూహాలు ఎలా మారుతాయో పలు సందర్భాల్లో నిరూపితమైంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన ఆర్థిక వనరుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తన బాధ్యతగా భావించి, పార్టీకి అవసరమైన అన్ని రకాల మద్దతును అందిస్తే, షర్మిల పోరాటానికి మరింత బలం చేకూరుతుంది. రేవంత్ వ్యూహాలు, షర్మిల పట్టుదల తోడైతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం ఖాయమనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు అలాంటి సహకారం లభించలేదు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకుంటే రాజకీయం మారిపోతుంది!
ప్రస్తుతం ఏపీలో ప్రధాన పార్టీల మధ్య ఉన్న చీలికను ఉపయోగించుకుని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును 15 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యం కావాలంటే కేవలం షర్మిల పాదయాత్రలు, ధర్నాలు మాత్రమే సరిపోవు. రేవంత్ రెడ్డి వంటి బలమైన నేత వెనుక ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో సహకారం అందించడం ప్రారంభిస్తే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక శక్తిగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ రేవంత్ అలా ఎందుకు చేయడం లేదన్నదే సమస్య.
