సిద్ధిపేటలో గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్ కంచుకోట, కానీ గత రెండు దశాబ్దాలుగా అది తన్నీరు హరీష్ రావుకు పెట్టని కోట గా మారింది. అక్కడ రాజకీయం పార్టీల చుట్టూ కాకుండా హరీష్ రావు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏ గుర్తు మీద నిలబడినా, లేదా స్వతంత్రంగా పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ స్థాయి క్రెడిబిలిటీని ఆయన కేవలం మాటలతో కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపట్టడం ద్వారా సంపాదించుకున్నారు. అక్కడ ప్రతి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఎవరైనా గెలవాలంటే హరీష్ రావు ఆశీస్సులు ఉండాల్సిందే అనేంతగా ఆయన వ్యవస్థను నిర్మించుకున్నారు.
పదవుల ఆశ.. పలకని ఓటర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆశ చూపడం వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే పట్టుదల కనిపిస్తోంది. అయితే, సిద్దిపేట ప్రజల కోణంలో చూస్తే.. హరీష్ రావు గెలిచిన ప్రతిసారీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆ నియోజకవర్గానికి ఒక మంత్రి ఉన్నట్లే లెక్క. హరీష్ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయనకున్న ప్రభావం ముందు కొత్తగా వచ్చే అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే, అక్కడ ఓటర్లకు కావాల్సింది పదవులు కాదు, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు
నాయకత్వ లేమి కాంగ్రెస్కు అసలు సవాల్
సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బలమైన నాయకత్వం లేకపోవడం. హరీష్ రావు రాజకీయ చతురత వల్ల అక్కడ ఇతర పార్టీల నేతలు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ ,బీజేపీ అక్కడ గెలవాలంటే పదవుల ప్రకటనలు చేస్తే సరిపోదు. హరీష్ రావు కంటే మిన్నగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో సొంత క్యాడర్ను నిర్మించుకోగల సమర్థుడైన నాయకుడు కావాలి. కేవలం పారాచూట్ అభ్యర్థులతోనో, అప్పటికప్పుడు ఇచ్చే హామీలతోనో దశాబ్దాల అనుబంధాన్ని తెంచడం అసాధ్యం.
రేవంత్ రెడ్డి వ్యూహం.. సాధ్యమేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల వంటి సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుని అక్కడ రాజకీయ శూన్యతను నింపాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమే కానీ, అది అషామాషీగా జరగదు. సిద్దిపేట వంటి చోట్ల మార్పు రావాలంటే అది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోకుండా, క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా చేసే ప్రకటనలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయి. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించాలంటే, అక్కడ హరీష్ రావు స్థాయికి దీటుగా పనిచేసే నాయకత్వాన్ని ముందుగా తయారు చేసుకోవాలి.
