తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక మొహమాటాలు.. మంచితనాలు అనే అబ్లిగేషన్లు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. తాను సాప్ట్ గా ఉంటే.. తన వెనుకే గొయ్యిలు తవ్వుతున్నారని క్లారిటీ రావడంతో ఆయన ఇక అందరితోనూ ఒకే రకంగా ఉండాలని అనుకుంటున్నారు. పదవి వచ్చిన తర్వాత అందరి జుట్టు చేతిలోకి తెచ్చుకోకుండా మంచిగా వ్యవహరించినందుకు తనకు గట్టి బుద్ది చెప్పారని.. ఇకనైనా తాను మారాల్సిందేనని ఆయన అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్న వారి వ్యవహారాలపై ఆయన పూర్తి స్తాయిలో రాజకీయం చేయబోతున్నారని అనుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మంచి తనంతో బలహీనపడిన రేవంత్ రెడ్డి
సాధారణంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మంత్రులుగా తాన అంటే తంథాన అనే వారినే నియమించుకుంటారు. ఎవరైనా తోక జాడించేలా ఉంటే వెంటనే ఇంటికి పంపుతారు. తోక జాడించాలి అనే ఆలోచన రాకుండా.. వారిని గుప్పిట పట్టి ఉంచేందుకు వారు చేసే అడ్డగోలు వ్యవహారాలపై తనకు పూర్తి సమాచారం ఉందన్న సంకేతాలు వారికి పంపుతారు. గతంలో అదే జరిగింది. కేసీఆర్ హయాంలో ఒక్క మంత్రి కూడా.. గీత దాటలేదు. దాటారు అనుకున్న వారిని రాజీనామా కూడా అడగలేదు.. బర్తరఫ్ చేశారు. రాజయ్య, ఈటలకు అదే్ అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే మంత్రులు తన శాఖలో ఏం జరుగుతుందో తెలియకపోయినా కిక్కురుమనేవారు కాదు. కానీ ఇప్పుడు అందరూ రేవంత్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారే.
కాంగ్రెస్లో జూనియర్నని.. సీనియర్లకు ప్రాధాన్యం
కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి జూనియర్. కానీ రాజకీయాల్లో జూనియర్లు, సీనియర్లు ఉండరు. తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెచ్చానని రేవంత్ కు క్లారిటీ ఉంది. కానీ ఆయన సీనియర్లకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారు. సొంత నియోజకవర్గాల్లో కనీస పలుకుబడి ఉండని సీనియర్లు హైకమాండ్ వద్ద మాటలకు విలువ ఉందని.. రేవంత్ లెక్క చేయడం లేదు. ఇలాంటి వారికి కీలక శాఖలు ఇచ్చి .. వారి శాఖల్లో జోక్యం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేసుకునే చాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారు చేసిన తప్పులకు కూడా.. తానే బాధ్యత వహించాల్సి వస్తోంది. తప్పులు చేసిన వారు కూడా.. రేవంత్ మీదే నిందలేస్తున్నారు.
రేవంత్ ను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో కొంత మంది మంత్రులు
తమ మాట నెగ్గకపోతే మీరు ఎంతో చేశారని ఆరా తీస్తామని.. కొంత మంది మంత్రులు బ్లాక్ మెయిల్ తరహాలో ప్రవర్తిస్తూండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రేవంత్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సిన రాజకీయం వేరని.. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన రాజకీయం వేరని క్లారిటీ వస్తోంది. అందుకే ఆయన తనదైన రాజకీయం చేయాలని అనుకుంటున్నారని.. ఇక మంత్రుల గుట్టు అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుని.. తోక జాడించినప్పుడల్లా ఒక్కొక్కటిగా బయట పెట్టి.. వారి వ్యవహారాల సంగతి తేలుస్తారని అంటున్నారు. కేసీఆర్ తల్చుకుంటే ఈటల రాజేందర్ కు ఎలాంటి పరిస్థితి ఎదురయింతే.. రేవంత్ తల్చుకుంటే.. కాంగ్రెస్ లోని సోకాల్డ్ సీనియర్లకూ అంత కంటే దారుణమైన పరిస్థితి ఎదురు కావడం పెద్ద విషయం కాదని చెబుతున్నారు. ఇలాంటి రాజకీయానికి రేవంత్ మొగ్గుతున్నారు. ఇక కాంగ్రెస్లో అసలు రాజకీయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
