తెలంగాణ మంత్రిగా రాత్రికి రాత్రి అజహరుద్దీన్ తో ప్రమాణం చేయించిన తర్వాత చాలా మంది ఆశావహులు మా పరిస్థితి ఏమిటని కిందా మీద పడ్డారు. అందుకే వారందరికీ మరో బిస్కెట్ వేశారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు అయిపోయిన తరవాత కేబినెట్ ప్రక్షాళన చేస్తామని ముగ్గురు, నలుగుర్ని తొలగించి.. అన్ని పదవులు భర్తీ చేస్తామనేది ఆ బిస్కెట్ సారాంశం. చివరికి పీసీసీ చీఫ్ కూడా ఇదే నిజం అనుకుంటున్నారు. తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని.. తనకు అలాంటి ఆలోచనలు లేవని బహిరంగంగా చెప్పడం ద్వారా బయట పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే.. ఇప్పుడల్లా కేబినెట్ జోలికి రారని అర్థం అయిపోతుంది.
ఆరు ఖాళీలుంటే ఏడాదిన్నర ఖాళీ పెట్టారు !
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నెండు మంత్రి పదవుల్నే భర్తీ చేశారు. మరో ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరును బట్టి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన ఏడాది వరకూ భర్తీ చేయలేదు. తర్వాత భర్తీ చేసినా మూడింటిని మాత్రమే భర్తీ చేశారు. ముస్లిం మైనార్టీకి ఇవ్వలేదని జూబ్లిహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా గుర్తుకు వచ్చి అజహర్‌కు చాన్స్ ఇచ్చారు. ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే..వాటిని అలా ఊరిస్తూనే ఉంచుతారు కానీ.. భర్తీ చేయరు. ఆ రెండు భర్తీ చేస్తే.. కాంగ్రెస్ లో అణుబాంబు పేలుతుంది. ఆ విషయం హైకమాండ్ కు బాగా తెలుసు.
విస్తరణ ఉంటే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇవ్వాల్సిన అవసరమే ఉండదు !
తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవికి అర్హత ఉన్న లీడర్ ఎవరు అంటే.. బోధన్ సుదర్శన్ రెడ్డికే. సమీకరణాలు కూడా ఆయనకు కలసి వచ్చాయి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఆయనకు చాన్స్ ఇవ్వొచ్చు. కానీ ఇవ్వలేకపోయారు. రేవంత్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. మిగిలిన రెండు పదవులు భర్తీ చేసే అవకాశం లేదు కాబట్టి.. ఆయనకు న్యాయం చేయడానికి కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. మంత్రుల స్థాయిలో ప్రోటోకాల్ ఉండేలా చూశారు. అన్ని శాఖలపై సమీక్షించే అధికారం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు మంత్రినే చేయవచ్చుగా అని కొందరు నిష్ఠూరమాడారు. అలాంటి చాన్స్ లేదు కాబట్టే ఈ పదవి ఇచ్చారు.
రచ్చ చేసుకోవడానికి సిద్ధంగా లేని హైకమాండ్
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ విషయంలో మొదటి నుంచి భిన్నంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంత మందిని ప్రోత్సహిస్తున్నారు. సీఎంపై విమర్శలు చేసిన వారిపై మౌనంగా ఉంటున్నారు. అది అలాంటి వారికి మరింత ప్రోత్సాహం వచ్చేలా చేస్తోంది. ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల రేసులో ఉన్నారు. పొరపాటున కదిలిస్తే వారంతా.. రచ్చ చేస్తారు. పదవులు రాని వాళ్లు పుట్టి ముంచుతారు. అందుకే ఇప్పుడల్లా మంత్రివర్గం జోలికి వెళ్లే అవకాశమే ఉండదని అనుకోవచ్చు.


