ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రముఖుల్ని హైకమాండ్ మరోసారి ఢిల్లీకి పిలిచింది. దేనికోసమో వారికే తెలియాలి కానీ.. కాంగ్రెస్ లీడర్, క్యాడర్ మాత్రం వారు ఆశగా ఎదురు చూసే పదవుల కోసం అని అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాదిన్నర అవుతున్నా.. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయలేకపోయారు. ఇప్పటికి ఓ పదిసార్లు కసరత్తు చేసి ఉంటారు. కానీ ఏకాభిప్రాయానికి రాలేదు. ఎవరికి పదవులు ఇస్తే ఎవరు పార్టీని బజారుకీడుస్తారో అని కంగారు పడిపోతున్నారు.
అలాగని భర్తీ చేయకుండా ఉండలేరు. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో అందర్నీ పిలిచి పదవులుపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరి సిఫారసులు కాకుండా.. పార్టీ హైకమాండ్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ కూడా పదవుల కోసం ఎదురు చూస్తోంది. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.
కొత్త ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్.. కొద్ది కాలంలోనే విస్తృతంగా సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలపై ఓ నివేదిక రెడీ చేశారు. పదవుల పంపకం ఫార్ములా కూడా సిద్ధం చేసి హైకమాండ్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైకమాండ్ అందర్నీ పిలిచిపదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే.. అసలు వారిని ఢిల్లీకి పిలిచింది ఇందుకేనా..లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది మాత్రం.. అక్కడికి వెళ్లిన తర్వాతే స్పష్టత వస్తుందని పార్టీ సీనియర్ నేతలు అంచనాలు పెంచకుండా చెబుతున్నారు.