పార్టీపరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంది. అయితే అనూహ్యంగా కేబినెట్ లో… అసలు అమోదం పొందని బిల్లు, వెనక్కి రాని ఆర్డినెన్స్ లను ఆధారంగా చేసుకుని జీవో జారీ చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి ఎన్నికలు నిర్వహిచాలని నిర్ణయించారు. బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదం పొందనప్పుడు ఈ జీవో చెల్లుబాటు కాదు. ఈ విషయం తెలియని వాళ్లు ఉండరు. మరి ఎందుకు కాంగ్రెస్ రిస్క్ చేస్తోంది ?
ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం చేయగలిగినంత చేశామన్న సంకేతాలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది. కేంద్రం సహకరించడం లేదని ఢిల్లీలో ధర్నా చేసి చెప్పారు. రాహుల్‌ను ప్రధానిగా చేసుకుని రిజర్వేషన్లు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెల్లని జీవోలతో రాజకీయం చేయాల్సి వస్తుందన్నది రాజకీయవర్గాలకు వచ్చే ప్రశ్న. పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయని కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. అలాంటి సమయంలో ఈ వివాదాస్పద నిర్ణయం .. నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదే.
ఎందుకంటే జీవో జారీ చేసి.. ఆ జీవో ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే.. స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. న్యాయప్రక్రియలో ఆలస్యమవుతుంది. ఇలా చేయడం వల్ల స్థానిక ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్న అభిప్రాయం పెరగడానికి కారణం అవుతుంది. స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. వారికి పదవులు రావడానికి స్థానిక ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఈ వివాదాస్పద జీవోల వల్ల స్థానిక ఎన్నికలు ఆగిపోతే వారు ఆర్థికంగా మరింత ఇబ్బంది పడతారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల కోసం అన్నట్లుగానే ఖర్చులు పెట్టుకుంటున్నారు.
రిజర్వేషన్ల జీవోను ఏదో విధంగా మ్యానేజ్ చేసి ఎన్నికలు నిర్వహించేసినా..తర్వాత అయినా అది చెల్లడం కష్టం. ఇది మరింత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అందుకే రిజర్వేషన్లకు.., స్థానిక ఎన్నికలకు ముడిపెట్టడం కన్నా.. దాన్ని విడదీసి..స్థానిక ఎన్నికలను పూర్తి చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం కలుగుతుంది. లేకపోతే ఈ వివాదంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.