తెలంగాణ ప్రభుత్వానికి మరి ఏ ఆప్షన్ లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అవకాశాలు లేవని తేలిపోయిది. అదే సమయంలో ఎన్నికల డెడ్ లైన్ దగ్గర పడటంతో .. ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ పొలిటికల్ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయిచుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
కేసీఆర్ సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారమే రిజర్వేషన్లు
స్థానిక ఎన్నికలకు కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేసేదేమీ ఉండదు. 2019లో తెలంగాణలో జరిగిన స్థానిక ఎన్నికలు లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాల్సి రావడంతో ఆ మేరకు ఖరారు చేసి జీవో ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవో ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే.. రిజర్వేషన్లు ఎక్కడా పెద్దగా మార్చాల్సిన పని ఉండకపోవచ్చు. సంఖ్యలో మార్పు లేకపోయినా రిజర్వుడు స్థానాలను మార్చే అవకాశం ఉంది. వాటిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
పార్టీ పరంగా 42 శాతం బీసీలకు అవకాశాలు
బీసీ రిజర్వేషన్లపై తాము హామీ ఇచ్చినందున ..అధికారికంగా న్యాయపరమైన చిక్కులు వచ్చినందుకు జీవోలు ఇవ్వలేకపోయినా.. బీసీలకు మాత్రం 42 శాతం అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, మండల, జిల్లా పరిషత్‌లకు ఎంపిక చేసే అభ్యర్థుల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. వారికే అవకాశాలు కల్పిస్తారు. బీసీల రిజర్వేషన్లపై ఇదే తమ చిత్తశుద్ధి అని ఇతర పార్టీలు ఈ అంశంపై కలసి రావాలని అన్నిపార్టీలు అలాగే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇతర పార్టీలు .. కాంగ్రెస్ పార్టీ హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్ప రిజర్వేషన్లు పెరగవు !
యాభై శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలనేది సుప్రీంకోర్టు తీర్పు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం సాధ్యం కాదు. కానీ రాజ్యాంగ సవరణ అంత తేలిక కాదు. బీజేపీకి కాంగ్రెస్ రాజకీయ అవసరాలు తీర్చాల్సిన అవసరం లేదు. అందుకే రాజ్యాంగసవరణ చేయరు. ఒకే వేళ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ల డిమాండ్లు మీద పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటి జోలికి వెళ్లరు. రేవంత్ శపథం చేసినట్లుగా రాహుల్ ను ప్రధానమంత్రిని చేసుకుంటే.. అదీ కూడా రాజ్యాంగ సవరణ చేసుకోగలిగినంత బలంతో అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు పెంచగలరు.