తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయానికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో కృష్ణా, గోదావరి నీటి వివాదాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం పెట్టి వచ్చి తెలంగాణకు మరణశాసనం రాశారన్నారు. అలాగే గోదావరి జలాలను తరలించుకోవాలని జగన్ కు సలహా ఇచ్చారన్నారు. బేసిన్లు, భేషజాలు లేవని చెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా వాళ్లకు పాలెగాడిగా తాకట్టు పెట్టారని మండిపడ్డారు
కృష్ణా జలాలు తెలంగాణలో అడుగు పెట్టినప్పుడే మళ్లించుకునేందుకు జూరాల నుంచి నీటిని తరలించాల్సి ఉందని ఆ పని చేయాలని అసెంబ్లీలో చిన్నారెడ్డి చెబితే ఆయనను అవమానించారన్నారు. కానీ ఏపీ కృష్ణా నది వెనక పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని తరలించుకుపోతోందన్నారు. పదేళ్లలో రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని దీనికి ఎవరు కారణమని ప్రశ్నించారు. అన్నింటిపై చర్చిద్దాం.. చట్టసభలకు రావాలంటే రావడం లేదన్నారు. కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేకపోతే.. తానే ఫామ్ హౌస్ కు వస్తానని… టైం డిసైడ్ చేయాలన్నారు.
మరో వైపు కేటీఆర్ ప్రెస్ క్లబ్ చేసిన చర్చల పాలిటిక్స్ పై భిన్నంగా స్పందించారు. ఒకాయన్ ప్రెస్ క్లబ్ కు వెళ్లి తాను రాలేదని మాట్లాడారని.. తనను క్లబ్లు, పబ్లు, వీధుల్లోకి పిలవొద్దన్నారు. చట్టసభలకు రమ్మని పిలిచామని గుర్తు చేశారు. ఆయన పేరు చెప్పడం కూడాతనకు ఇష్టం లేదని కేటీఆర్ గురించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను సవాల్ చేయలేదని ఆరోగ్యకరమైన చర్చ కోసం అసెంబ్లీకి రావాలని సూచన మాత్రమే చేశానన్నారు.