ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలను కొనసాగించేందుకు ఓపెన్ ఏఐ ఛైర్మన్ శామ్ ఆల్ట్‌మన్ ఆసక్తి చూపుతున్నారు. గత సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏఐ పట్ల చూపుతున్న నిబద్ధతను గమనించిన ఆల్ట్‌మన్, మరోసారి ముఖ్యమంత్రితో ముఖాముఖి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ఓపెన్ఏఐ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలంగాణలోని కీలక రంగాలైన వైద్యం, వ్యవసాయం , విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పరిపాలన వరకు ఏఐని అనుసంధానించడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆయన ఆల్ట్‌మన్‌తో చర్చించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఏఐ ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మెరుగుపరచడం వంటి అంశాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ లీడర్ల సహకారం అత్యంత కీలకం కానుంది. శామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖులు స్వయంగా ముఖ్యమంత్రితో చర్చలు జరపడం అనేది రాష్ట్రంలో పెట్టుబడులకు , సాంకేతిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఈ భేటీ ద్వారా తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రాజెక్టులు మరింత వేగవంతం కానున్నాయి.