బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అక్టోబర్ నెలాఖరులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత స్పీకర్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారి విషయం ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి కూడా దృష్టి సారించారు. ఆదివారం… పిలిపించుకుని వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా కడియం రాలేదు.. మిగతా తొమ్మిది మంది వచ్చారు.
ఉపఎన్నికలపై అభిప్రాయం తీసుకున్న రేవంత్?
ఆరు నూరైనా ఉపఎన్నికలు రావని.. సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. వారికి కూడా అదే భరోసా ఇస్తున్నారు. అయితే రాజకీయవ్యూహాల ప్రకారం అయినా ఉపఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుదన్నదానిపై వారితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతోందని.. ఆ తర్వాత మరింత హైప్ వస్తుందని.. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలు ముదురుతాయని.. అప్పుడు ఉపఎన్నికలకు వెళ్తే మంచి అవకాశాలు ఉంటాయని రేవంత్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది.
స్పీకర్ ముందు రెండు మార్గాలు !
సుప్రీంకోర్టును ధిక్కరించే సాహసం స్పీకర్ చేయకపోవచ్చని భావిస్తున్నారు. అప్పీల్‌కు వెళ్లడం కూడా ఉండకపోవచ్చని.. సుప్రీంకోర్టు తీర్పును ఏదో విధంగా అమలు చేసి సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు. అందుకే స్పీకర్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఎమ్మెల్యేలతో పార్టీ మారలేదని వివరణ తీసుకుని బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించడం. ఫిరాయింపుల చట్టం ప్రకారం.. దానం మినహా మిగిలిన వారు పార్టీ మారారన్నదానికి ఆధారాల్లేవు. అయితే ఇక్కడ నైతిక పరమైన విషయాలు వస్తాయి. చట్టాన్ని మాయ చేయవచ్చు కానీ ప్రజల్ని మాయ చేయలేరుగా అని. మరో ఆప్షన్ రాజీనామాలు చేయించడం. అనర్హతా వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే.. రాజీనామాలు చేయిస్తారు తప్ప.. వేటు వేయరు. కానీ ఈ నిర్ణయం రాజకీయంగా సాహసం.
ఎమ్మెల్యేలకు ఏమని భరోసా ఇచ్చారు ?
ఎమ్మెల్యేల సమావేశంలో రేవంత్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు పూర్తి భరోసా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారి రాజకీయ భవిష్యత్ కు.. అలాగే నియోజకవర్గాల్లోనూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తర్వాత… బీఆర్ఎస్ నుంచి మిగతా ఎమ్మెల్యేలను ఆకర్షించి.. విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచన కూడా రేవంత్ మాటల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు… రేవంత్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది సీఎం రేవంతే.!