ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ప్రశ్నించడం అంటే.. తెలంగాణ జాతిపితను అవమానించడం అని ప్రచారం చేయడంపై రేవంత్ సైటైర్లు వేశారు. కొంత మంది తాము జాతిపితలమని..ఉద్యకమకారులమని తమకు తామే రాసుకుంటున్నారని.. నిజమైన జాతిపిత మహాత్మా గాంధీ.. పదవులను త్యాగం చేసి, తూటాలకు ప్రాణాలర్పించారన్నారు. కానీ, ఇక్కడ జాతిపిత అని చెప్పుకుంటున్న వారు పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని.. జాతిపిత ఎట్లవుతారనని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు తమను తిరస్కరించినప్పుడు హుందాగా తప్పులు ఒప్పుకుంటే గౌరవం ఉండేదని, కానీ ప్రజలే తప్పు చేశారనే ధోరణిలో మాట్లాడటం ఏ రకమైన ఉద్యమకారుడి లక్షణమని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి, బెడ్ రూమ్ నుంచి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసినప్పుడు ఈ ఉద్యమ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం నోటీసులు ఇచ్చి, గౌరవప్రదంగా విచారణకు పిలిచిందని.. బీఆర్ఎస్ హయాంలా అరాచకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.
ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారని, అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. మనం దైవాంశ సంభూతులం కాదు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అంబేద్కర్ చెప్పారు అని గుర్తు చేశారు. శిబు సోరెన్ వంటి పెద్ద నాయకులే విచారణ ఎదుర్కొన్నప్పుడు, ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవన్నారు. చక్రవర్తుల కాలం చెల్లిపోయింది, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.