పాలనలో ప్రయోగాలు ప్రజలకు ఉపయోగపడాలి. రాష్ట్రాలనికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి. ఒక నిర్ణయం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి సంకోచించకూడదు. తెలంగాణలో స్థిరాస్తులను ఎక్కడివైనా, ఎక్కడైనా రిజిస్టర్ చేసుకునే విధానాన్ని అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాంగ్ స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాల గురించి తెలిసిన తర్వాత కూడా ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం విస్మయకరం.
నయీం గ్యాంగ్ ఒక చోట ఉన్న స్థిరాస్తులను వేరే చోట రిజిస్టర్ చేయించుకుంది. దాంతో వేల మంది అమాయకులు అన్యాయానికి గురయ్యారు. అనేక అనర్థాలు జరిగాయి. ఇదే పనిని ఇంకెవరైనా చేసే అవకాశం ఉంది. తమకు అనుకూలమైన అధికారులు లేదా లంచాలకు లొంగే వారు ఉన్న చోట రిజిస్టర్ చేయించుకోవచ్చు. కాబట్టి భూమాఫియా దందాలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయినా, ఈ విధానాన్ని అమలు చేయడానికే తెరాస ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే అక్రమాలకు చెక్ పెట్టడానికి అంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది.
సంబంధిత ప్రాంత సబ్ రిజిస్ట్రార్ అభ్యంతరం లేదని సమాచారం ఇస్తేనే ఎక్కడి నుంచైనా రిజిస్టర్ చేయాలనే ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ రిజిస్టర్ చేయకూడదని ఆస్తి అయితే ఆ విషయం తెలపాలట. తప్పుడు సమాచారం ఇస్తే ఆ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి.
బరితెగించిన అక్రమార్కులను ఏ నిబంధనలూ ఆపలేవు. ఎవరైనా అధికారి వీలైనంత సంపాదించాలని కంకణం కట్టుకుంటే ఇక అడ్డూ అదుపూ ఉండదు. అక్రమంగా రిజిస్టర్ చేయడమే పనిగా పెట్టుకుని లంచాలకు మరిగితే ఈ ఉద్యోగం, ఇక్కడ వచ్చే జీతం గురించి పట్టించుకోక పోవచ్చు. అలాంటి వారు లక్షలు కోట్లలో అక్రమంగా సంపాదిస్తారు. కాబట్టి కొన్నేళ్ల తర్వాత ఈ విషయం బయటపడి ఉద్యోగం పోయినా పరవాలేదు అనుకుంటే అప్పుడెలా? అప్పటికే అనర్థం జరిగిపోతుంది. కాబట్టి ఈ విషయాలను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో పాత, సంప్రదాయబద్ధమైన విధానాలే మంచివేమో ఆలోచిస్తే తప్పేమీ లేదు.