2024 దేశ రాజకీయాల్లో రీ సౌండింగ్ ఇచ్చారు. అలాగే ఏపీలోనూ. విర్రవీగిన పాలకులకు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. వారి తీర్పు ఫలించింది. 2025 ప్రజల జీవితాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రభుత్వం వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడం లేదు. గతంలో జరిగిన అరాచకాల్లేవు. లా అండ్ ఆర్డర్ దారిలోకి వచ్చింది. రెచ్చగొట్టాలని చూస్తున్నవారికి పోలీసులు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి దారిలోకి తెస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ కక్ష రాజకీయాలకు పాల్పడకుండా అన్నింటికీ చట్టమే సూత్రంగా ముందుకెళ్తోంది. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది.
చెప్పిన పనులన్నీ చేస్తున్న ప్రభుత్వం
అధికార కూటమి ప్రభుత్వం పాలనా పనితీరు ప్రకారం విశ్లేషిస్తే చెప్పిన పనులన్నీ ఉన్నదిఉన్నట్లుగా చేసుకుంటూ వెళ్తోంది. ఐదు సంవత్సరాల పాటు సాగిన విధ్వంసాన్ని కరెక్ట్ చేస్తూ.. పనుల్ని మళ్లీ గాడిలో విజయవంతంగా పెట్టగలిగింది. పోలవరం పరుగులు పెడుతోంది. అమరావతి నిర్మాణం ఇప్పటికే ఊపందుకుంది. ప్రాజెక్టుల పన్నులన్నీ జరుగుతున్నాయి. రోడ్లు నున్నగా అయ్యాయి. అన్నీ ఒక్క సారే చేయలేరు కానీ వీలైనంత వరకూ ఏడాదిలో చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారు. పెట్టుబడుల పరంగా గోల్డెన్ ఇయర్. గూగుల్ ఏఐ హబ్ ఓ చరిత్ర. కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చేశాయి. ఇంకాచాలా దారిలోఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వచ్చే ఏడాది మరిన్ని ఫలితాలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
కక్ష సాధింపులకు దూరం – చట్ట ప్రకారమే చర్యలు
ఈ ఏడాదిలో చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని వారంతా కటకటాల పాలయ్యారు. కానీ ఒక్కరిపైనా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందన్న పేరు రాలేదు. ఎందుకంటే అర్థరాత్రిళ్లు ఎవర్నీ అరెస్టు చేయలేదు. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ చాలా మంది జైల్లోఉన్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం ఇంకా దూకుడుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చట్ట ప్రకారం ఇంకా చేయాల్సినవి.. జరిగిపోతాయని భరోసా ఇస్తున్నారు.
సాఫీగా సాగిపోతున్న కూటమి పార్టీలు
కూటమి పార్టీల మధ్య సఖ్యత సాఫీగా సాగిపోతోంది. పార్టీలు నామనేటెడ్ పోస్టులను ఏ వివాదాలు లేకుండా.. సామరస్యంగా పంపిణీ చేసుకున్నారు. అన్ని పార్టీల్లో కష్టపడిన నేతలకు గుర్తింపు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ కూటమి పార్టీల మధ్యఅపోహలు వచ్చేలా ప్రకటనలు చేయడం లేదు. ఆయన పదిహేనేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్యాడర్ ను మానసికంగా రెడీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి వారు ఉన్నా.. వారెవరూ నిజంగా కూటమి పార్టీలతో నేరుగా సంబంధం లేని వారే కాబట్టి పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ తో పాటు ఆయన మీడియా చేస్తున్న ప్రయత్నాలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి కానీ ఫలితం ఇవ్వడం లేదు.
ఏడాది అంతా ఆజ్ఞాతంలోనే బతికిన వైసీపీ
గత ఎన్నికల్లో తగిలిన దెబ్బతో వైసీపీ ఈ ఏడాది అంతా ఆజ్ఞాతంలోనే బతికింది. జగన్ రెడ్డి అత్యధిక కాలం బెంగళూరులోనే ఉన్నారు. నెలకో ప్రెస్మీట్ పెట్టి ఆణిముత్యాలు వదిలారు. రోడ్డుపైకి వచ్చిందే లేదు. కోటి సంతకాల పేరుతో చేసిన డ్రామాలు నవ్వుల పాలయ్యాయి. అలాగే బీజేపీకి ఎదురెళ్లలేని దైన్యంతో ఆ పార్టీ కుంచించుకుపోతోంది. సీనియర్ లీడర్లు ఎవరూ తెరపైకి రావడం లేదు. అయితే ప్రెస్మీట్లు పెడుతున్నారు.లేకపోతే అది కూడా లేదు.
మొత్తంగా 2025 … ఓ సంచలనాత్మక ఏడాది తర్వాత… ఏపీ రాజకీయాల్లో ప్రశాంతతను తీసుకొచ్చిన ఏడాది అనుకోవచ్చు. కానీ 2026 మాత్రం ఇలా ఉండే అవకాశం లేదు. మరింత ఎర్రగా మారే అవకాశం ఉంది.
