రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ , నారా లోకేశ్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో ఈ కేసులో విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇవాళ విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటంతో హాజరవుతారని భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు వైసీపీకి పని చేశారు ఆర్జీవీ. తన సోషల్ మీడియా ఖాతాలో టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేవారు. టీడీపీ నేతల్ని కించ పరుస్తూ సినిమాలు కూడా తీశారు. చివరికి టీడీపీ సోషల్ మీడియాకు చెందిన ముగ్గురు మహిళలు తమపై అసభ్య భాషను ప్రయోగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. అది సీరియస్ అంశం కావడంతో కేసులు నమోదయ్యాయి.
ఆర్జీవీ ఇలా వైసీపీకి పని చేసినందుకు ఆయనకు డబ్బులు కూడా ప్రభుత్వ ఖాతా నుంచి ఇచ్చారు. ఆయన తీసిన ప్రాపగాండా సినిమాను.. ఫైబర్ నెట్ లో ప్రసారం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించారు. కానీ ఆ సినిమాను ఎవరూ చూడలేదు. వ్యూస్ కు ఇంత చెప్పి ఇవ్వాల్సి ఉన్నా.. కోట్లు రాసిచ్చేశారు. దీనిపైనా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. డబ్బులు కట్టాలని నోటీసులు పంపారు. అయితే తన వద్ద డబ్బుల్లేవని ఆయన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపైనా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.