రాంగోపాల్ వర్మలోని దర్శకుడు అప్పుడప్పుడూ నిద్ర లేస్తుంటాడు. నిద్ర లేచి కళ్లు తెరచినప్పుడల్లా అతన్నుంచి రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ లా మంచి సినిమాలొస్తుంటాయి. ఇప్పుడు వంగవీటి ట్రైలర్ చూసినా – వర్మ కాస్త హుషారు తెచ్చుకొన్నట్టు కనిపిస్తుంది. యదార్థగాధని తెరపై ఆవిష్కరించడంలో వర్మ ఎప్పుడూ చేయి తిరిగిన దర్శకుడే. వంగవీటి ట్రైలర్ అదే విషయాన్ని మరోసారి ఆవిష్కరిస్తోంది. కథ, కథనాలు ఏ స్థాయిలో వండుకొన్నాడో, పాత్రల్ని ఏ లెవిల్‌కి తీసుకెళ్లాడో ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
వంగవీటి అనగానే వర్మ ఎవరి కథ చెప్పబోతున్నాడో, ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడో అర్థమవుతూనే ఉంది. ‘కాపు’కాసేశక్తి అనే ట్యాగ్‌లైన్‌తో పాటు ‘కమ్మ’ని పౌరుష సూక్తి అంటూ తాను ఏఏ వర్గాల మధ్య వైరం గురించి సినిమా తీశాడో హింట్ ఇచ్చేశాడు. కొన్ని డైలాగులు కూడా తప్పకుండా విజయవాడని, ఆ ప్రాంతం చుట్టూ పరచుకొన్న పాత పగల్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మొత్తానికి వర్మ మరో సంచలనానికి తెర లేపుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. వర్మ టేకింగ్, ఆర్.ఆర్.. ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ‘వంగ వీటి.. వంగ వీటి’ అంటూ ట్రైలర్ ప్రారంభంలోనే పాటందుకొని కాస్త మూడ్ పాడు చేశాడు రాంగోపాల్ వర్మ. అదొక్కటీ లేకపోతే ఈ ట్రైలర్ సినిమా చూసినంత కిక్ ఇచ్చేద్దును.