తమ్ముడు ట్రైలర్ వచ్చింది. నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో రూపొందిన సినిమా ఇది. నితిన్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఎందుకంటే ఈమధ్య తన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ‘రాబిన్‌వుడ్’ పై చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు. కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది. అన్నింటికంటే ముఖ్యంగా నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. కాకపోతే… నితిన్ పై రూ.70 కోట్ల సినిమా అంటే, అది రిస్కీ ప్రాజెక్టే. నితిన్ మార్కెట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కథని నమ్మి తీసిన సినిమా ఇది. ఆ డబ్బు వెనక్కి తీసుకురావడం పెద్ద టాస్క్.
వేణు శ్రీరామ్ ఏమీ కమర్షియల్ డైరెక్టర్ కాదు. తన సినిమా ‘వకీల్ సాబ్’ మంచి వసూళ్లు తెచ్చుకొన్నా, ఆ సినిమా పూర్తిగా పవన్ కల్యాణ్ మానియాపై నడిచిపోయింది. ఇక్కడ ఆ సౌలభ్యం లేదు. ఓ కొత్త తరహా సెటప్ లో చేసిన సినిమా ఇదని విజువల్స్ చూస్తే అర్ధమైపోతోంది. ఈ సెటప్ మన ప్రేక్షకులకు ఎంత వరకూ పడుతుంది? వాళ్లు ఎంత వరకూ కనెక్ట్ అవుతారు? అనేది పెద్ద ప్రశ్న. నిజంగా కనెక్ట్ అయినా, హిట్ టాక్ తెచ్చుకొన్నా, రూ.70 కోట్ల రిటర్న్ సాధిస్తుందా? అనేది మరో ప్రశ్న. ఈమధ్య మంచి టాక్ వస్తే, చిన్న సినిమాలు సైతం రూ.100 కోట్లు సాధిస్తున్నాయి. కాబట్టి రిటర్న్‌పై దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం నితిన్ కూడా పారితోషికం తీసుకోలేదు. సినిమా హిట్టయితే, లాభాల్లో వాటా అందుకొంటాడు. నిజానికి మీడియం రేంజ్ హీరోలంతా ఈ దారిలో సినిమాలు చేస్తే బెటరేమో. అటు హీరోలకూ, ఇటు నిర్మాతలకూ సౌలభ్యంగా ఉంటుంది. నితిన్ అయితే ఈ సినిమాపైనే అన్ని ఆశలూ పెట్టుకొన్నాడు. వేణుతో చేయబోతున్న ‘ఎల్లమ్మ’ కూడా కమర్షియల్ సినిమా కాదు. ఆ తరవాత చేయబోయే విక్రమ్ కె.కుమార్ దీ రిస్కీ ప్రాజెక్టే. తను ఎప్పుడు ఫ్లాప్ ఇస్తాడో, ఎప్పుడు హిట్ కొడతాడో చెప్పలేం. కమర్షియల్ మీటర్ లో ఉన్న సినిమా తమ్ముడు మాత్రమే. కాబట్టి ఏం చేసినా ఈ సినిమాతోనే చేయాలి.