ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ పూర్తి అయిపోయి తీర్పు కూడా వచ్చింది. ఆ తీర్పు ఎంతో గొప్పదని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశంసిస్తూనే న్యాయవ్యవస్థ పనితీరుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో లేకపోయినా..చట్టంలో లేకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నిర్ణయం తీసుకోవాల్సిందేనని ..స్పీకర్ కు గడువు పెట్టిన సుప్రీంకోర్టు.. మరి తమ వద్ద పెండింగ్ లో ఉన్న కేసుల విచారణలో ఎందుకు గడువు పెట్టుకోదని ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా ఆయన జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసునే ప్రస్తావించారు.
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఏళ్ల తరబడి కోర్టులో ఉన్నాయి. చార్జిషీట్లు దాఖలైనా ట్రయల్ ప్రారంభం కావడం లేదు. ఈ లోపు నిందితులు.. నిర్దోషులుగా చెలామణి అవుతున్నారు. జగన్ ఏకంగా సీఎం అయి మరిన్ని అరాచకాలు చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు మీదనే నిందలేస్తూ లేఖలు రాశారు. ఎంతో మంది న్యాయమూర్తులపై మీడియా, సోషల్ మీడియాద్వారా తన పార్టీ నేతలతో దాడులు చేయించారు. తీవ్రమైన నేరాలు ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ఆ కేసులు విచారణకు రాకపోతూండటంతో .. నిర్దోషిగానే చెలామణి అవుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత ఆర్కే పరోక్షంగా వ్యవస్థను ప్రశ్నించారు.
పనిలో పనిగా జాతీయ మీడియాపైనా ఆయన విశ్లేషణ చేశారు. గతంలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం ఉండేదని ఇప్పుడు ఏమీ లేదని అంతా.. పార్టీల వారీగా వార్తలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆయనను అరెస్టు చేసినప్పుడు… దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం కేజ్రీవాల్ ను అవినీతి పరుడుగా ఖరారు చేసిన మీడియా చానల్స్ తీరును ఆర్కే ఖండించారు. అదే సమయంలో తాము ఏదైనా చేయాలనుకుంటే.. తమకు కులం , మతం, ప్రాంతం అంటగడుతున్నారని.. తెలుగునాట పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన పరోక్షంగా తమను తాము సమర్థించుకున్నారు. ఆ నైపుణ్యం ఆయనకు ఉంది.
రౌస్ అవెన్యూ కోర్టు జడ్డిని ఆర్కే తన ఆర్టికల్ అంతా సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉన్నారు. ఆయన లాంటి వారు అడుగుకు ఒకరు కావాలని అంటున్నారు. అన్యాయం హద్దులు దాటినప్పుడు న్యాయం చేయడానికి ఒకరు పుట్టుకొస్తారని సినిమాల్లో ఇచ్చే ఎలివేషన్ల తరహాలో జితేందర్ సింగ్ ను పొగిడారు. ఈ కేసులో రౌస్అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. స్టే ఇస్తే .. ఏం అంటారో మరి?

