తెలంగాణలో ఇక జరగబోయేది అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనేనని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన కొత్త పలుకులో తేల్చేశారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దారి తప్పిందని ప్రజలకు దూరమైపోయిందని ఆయన విశ్లేషించారు. ప్రతి వారాంతంలో రాసే కొత్త పలుకులో ఈ సారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను సమగ్రంగా విశ్లేషించి…బీఆర్ఎస్ పని అయిపోయిందని పరోక్షంగా తేల్చారు.
రేవంత్ రెడ్డి నాయకత్వం చాలా పక్కాగా ఉందని..ఆయన ఓ క్రమ పద్దతిలో ప్రభుత్వం, పార్టీపై పట్టు సాధించి చివరికి నేనే రాజు..నేనే మంత్రి అని ప్రకటించుకునేదాకా వచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రాను రాను కుంచించుకుపోతోందని ఉద్యమం నాటి కంచుకోటల్లో నేడు ఉనికి కష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ ఉందంటే.. కేవలం హరీష్ రావు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో, రియల్ఎస్టేట్ మందగమనంపై వల్ల ప్రజల్లో ఆగ్రహం ఉండి..రంగారెడ్డి జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ కు పట్టు ఉందని.. చెబుతున్నారు. రేవంత్ వీటిపైనా దృష్టి పెడతారని పరోక్షంగా తేల్చారు.
ఇంకో విశేషం ఏమిటంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా అధికారం సాధిద్దామని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నా… అలాంటి అవకాశాలు కూడా ఉండవని ఆర్కే అంటున్నారు. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వానికి బీఆర్ఎస్ ఫ్యామిలీపై సదభిప్రాయం లేదు. పొత్తులు కాకపోయినా కనీసం విలీనం చేస్తామని వెళ్లినా .. అవసరం లేదని పంపేశారని.. ఇక ముందు కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండదని ఆర్కే అంటున్నారు. అయితే బీజేపీ ఒంటరిగా ఎదగాలని అనుకుంటున్నప్పుడు.. సరైన వ్యూహాలు పాటించడం లేదని.. బలమైన నేతల్ని ప్రోత్సహించడంలో కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆర్కే అంటున్నారు.
బీఆర్ఎస్ ఇప్పటికీ నిజాలు తెలుసుకోలేకపోతోంది.. సరైన రాజకీయం చేయలేకపోతోందని అంతిమంగా తేల్చారు. ఆర్కే కేవలం తన విశ్లేషణను మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకుని ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ప్రజల దృక్పథం మారిపోతుందని ఆయన చెబుతూనే… ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఆయన విశ్లేషించారు. ఆర్కే పలుకులో ఉన్నవేవీ.. బీఆర్ఎస్ పై కోపంతోనో.. రేవంత్ పై అభిమానంతోనో చెప్పినవి కాదని.. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది.

