అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం. బిడ్డలు తప్పులు చేసినా ఆ తప్పులను భరించి, మన్నించి , వాత్సల్యంతో క్షమించి, తమ బిడ్డలపై ఈగ వాలనీయని తెగువ తల్లిదనానికి మాత్రమే ఉంటుంది. ప్రసవ వేదన తెలిసిన ఏ తల్లీ కూడా ఇంకో తల్లి కన్న బిడ్డల విషయాల్లో అంత వేగంగా ద్వేషాన్ని చూపడానికి ప్రయత్నం చేయదు కూడా. మాతృత్వ గొప్పదనం అలాంటిది. ఈ సృష్టిలో తల్లి పాత్ర ఎప్పుడూ శిఖర స్థానమే. అంతెందుకు నోరు లేని జంతువులు సైతం వాటి పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న దృశ్యాలను తెల్లవారితే ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం. మనసులను కదిలించే ఆ దృశ్యాలను చూసి చాలాసార్లు చలించిపోతూ ఉంటాం కూడా. అమానవీయంగా తల్లులను నడిరోడ్డుపై వదిలేస్తున్న బిడ్డలను చూస్తున్న మనకు బిడ్డల పట్ల ద్వేషాన్ని చిమ్ముతున్న తల్లుల జాడ నూటికో కోటికో ఎక్కడో తప్ప పెద్దగా కనిపించదు ఈలోకంలో. అలాంటి మనలో చాలామందికి నిన్నటి రోజున ఒక మహిళ, తల్లిదనం చూసిన ఓ తల్లి, ఎంతో బాధ్యతగా మెలగాల్సిన ఓ రాజకీయ నాయకురాలు నోటి నుండి వచ్చిన మాటలు ఎన్నో గుండెలను బాధించాయి. ఒక తల్లి ఇంకో తల్లి కన్న బిడ్డపై మానవత్వం మరచి చేసిన వ్యాఖ్యలను చూసిన మహిళా లోకం సదరు ఆ మహిళా నాయకురాలిపై విరుచుకుపడుతోంది.
ఆ హేయమైన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ఆమె లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ఆయా ఎదుటి వ్యక్తుల వయసుకు, వాళ్ళ అనుభవానికీ, వాళ్ళ స్థానాలకూ, వాళ్ళ ఎదుగుదలకూ, వాళ్ళ ప్రతిభకూ ఏనాడూ గౌరవం ఇవ్వని మాజీ ఎమ్మెల్యే రోజా. ఆమె వ్యాఖ్యలు చేసింది ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న పసిబిడ్డ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పై. రాజకీయ విమర్శల్లో హుందాతనం పోతోంది అనడానికి ఉదాహరణలుగా చెప్పుకోవడానికి ఆమె గత కొన్నేళ్లుగా మాట్లాడిన మాటలను తీసుకుంటే చాలు ఉదాహరణలుగా పదుల సంఖ్యలో ఆమె వ్యాఖ్యలు వినబడతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండీ ఆమెకు పెద్దగా మాట్లాడే అవకాశాలను ఇవ్వలేదు అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోవడంతో అధికారపక్షాన్ని తప్పుపట్టలేక తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది అక్కడి ప్రతిపక్ష వైసీపీ. ముఖ్య మంత్రి చంద్రబాబు అయినా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా, మంత్రి నారా లోకేష్ ఆయినా క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు తప్ప గత ప్రభుత్వం చేసినట్టు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశానికి పోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులకూ పోలేదు. దీనినే అలుసు తీసుకున్న వైసీపీ ప్రజా సంక్షేమ పథకాల అమలులో లోపాలను వెతకలేక, ఏదో ఒక నెపంతో భగవంతుడిని సైతం తమ రాజకీయాల్లోకి లాగడానికి చూడటంతో ఆంధ్రా ప్రజల్లో వైసీపీ రాజకీయాలపై వెగటుని పుట్టించింది.
ఆక్రమంలో భాగంగా రోజా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. ఆమెలో మార్పుని ఆశించిన ఆమె అభిమానులకు సైతం నిరాశను కలిగించాయి. “కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా ఈమధ్యనే రుచిచూసాడు” అంటూ ఆమె మాట్లాడిన తీరు చూసిన సామాన్య జనం “ఇంతలా దిగజారాలా రోజమ్మా” అనుకుంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అవహేళన చేస్తూ ఆయన అనుభవానికి గౌరవం ఇవ్వని ఆమెపై టీడీపీ కేడర్ భగ్గుమంది. పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగిన రోజైతే దేశం మొత్తం చలించిపోయింది. జనసైనికులు తమ ఇంట్లో బిడ్డకు నష్టం జరిగినంతలా వేదనపడడ్డారు. టీడీపీ కేడర్ అయితే మీ నాయకుడి బిడ్డకేం కాదంటూ జనసేన కేడర్ కు ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ దగ్గర నుండి సామాన్య పౌరుడి వరకూ పార్టీలకు అతీతంగా ఆ బిడ్డ వేగంగా కోలుకోవాలని కోరుకున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, లోకేష్, జగన్, కేటీఆర్, గవర్నర్లు, కేంద్రమంత్రులు, సినీ ప్రముఖులు, మరియు వివిధ పార్టీల నాయకులు అందరూ సేనానికి ధైర్యం చెప్పి బాసటగా నిలిచారు. అలాంటిది రాజకీయాల్లో పసిపిల్లల ప్రస్తావన తేకూడదన్న కనీస ఆలోచన లేకుండా రోజా మాట్లాడిన తీరుకి ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వెలువడింది. ఇకనైనా రాజకీయ నాయకులు తమ విమర్శల్లో కుటుంబాల్లో ఆడబిడ్డలను, పిల్లలను లాగి ఆయా కుటుంబాలకు మానసిక వేదన కలిగించే కుసంస్కారానికి దూరంగా ఉంటే బాగుండన్నది సామాన్య ప్రజల అభీష్టం.