రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా క్రికెట్లో ఇద్దరు ఇద్దరే. ధోనీ, యువరాజ్ తర్వాత అలాంటి స్టార్ ఎట్రాక్షన్‌తో టీమిండియా క్రికెట్‌ని ఓ వెలుగు వెలిగించిన ఆటగాళ్లు. ఎన్నో మరపురాని విజయాలు, రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జట్టు ఎప్పుడూ కొత్త నీరు కోరుకుంటుంది. దీంతో పాటు ఫామ్‌లో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు కలిసి రావు. బోర్డులో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు, వ్యక్తిగత సమస్యలు కారణంగా కొన్ని ఎదురుగాలులు వీస్తాయి. ఇప్పుడు రోహిత్, విరాట్ పరిస్థితి కూడా ఇలానే వుంది.
ఈ ఇద్దరు టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించారు. వీరు లేకుండా ఏ పెద్ద మ్యాచ్ ఉండేది కాదు. అయితే ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఓటమి ఇద్దరినీ మానసికంగా చాలా కృంగదీసింది. ఈ దశలోనే ఇద్దరూ ఇంకా రిటైర్ అయిపోదామనుకున్నారు. కానీ టి20 వరల్డ్ కప్ విజయం వాళ్లకు మంచి ఉత్సాహం ఇచ్చింది. అదే ఉత్సాహంతో 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాలని భావించారు. అయితే ఈ మధ్యలో బోర్డులో చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి. గంభీర్ కోచ్‌గా వచ్చాడు. గంభీర్‌తో కోహ్లీకి గిట్టదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరూ అంటి ముట్టునట్టుగానే ఉన్నారు.
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కి రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అయితే టెస్ట్ క్రికెట్‌కి కూడా గుడ్ బై చెప్పడం అభిమానులకు ఒక్కింత షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఒక క్రికెటర్ అన్నిటికంటే చివరగా వదులుకునే ఫార్మాట్ అది. అలాంటిది ముందే వాళ్లు టెస్ట్‌కి గుడ్ బై చెప్పడం, దాన్ని బోర్డు అంగీకరించడం..ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఊహించని పరిణామాలే.
రోహిత్, విరాట్ ఈ ఇద్దరికీ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ఇద్దరినీ ఆడించే ఉద్దేశం బోర్డుకి ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, క్రికెట్‌ను ఫాలో అయ్యే ఎవరికైనా సరే ఈ విషయం అర్థం అవుతుంది. వాళ్లని పొమ్మనలేక పొగ పెట్టే కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా నేషనల్ న్యూస్ పేపర్స్‌లో వస్తున్న లీకులు దీనికి నిదర్శనం.
2027 వరల్డ్ కప్ కోసం అందరూ యువ ఆటగాళ్లతోనే టీం సిద్ధమవుతుందనే లీకులు ఇచ్చారు. అలాగే అక్టోబర్‌లో టీమిండియా వెళ్లే ఆస్ట్రేలియా టూర్, రోహిత్-విరాట్లకు చివరి వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ అవుతుందని, ఇలాంటి మేటి ఆటగాళ్లను ఆస్ట్రేలియా బోర్డు ఘనంగా సత్కరించాలని భావిస్తుందని, మహా అయితే ఓ ఏడాది వీరు ఆడే అవకాశం ఉంటుందని లీకులు అందించారు. ఇది పక్కా బీసీసీఐ రాజకీయం. ఒకరిని జట్టు నుంచి తప్పించాలంటే బోర్డు ఎప్పుడూ ఇలాంటి లీకులే వదులుతుంటుంది. మెల్లగా ఫ్యాన్స్‌ని ప్రిపేర్ చేస్తుంటారు. గతంలో ఇలాంటి సాఫ్ట్ ఎగ్జిట్ ప్లాన్స్ చాలామంది ఆటగాళ్ళు ఎదుర్కున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో కూడా అదే జరుగుతుంది.
నిజానికి 2027 వరల్డ్ కప్ ఆడకపోతే, ఈ ఇద్దరూ ఒక ఏడాది పాటు కొనసాగడంలో అసలు అర్థమే లేదు. రోహిత్ శర్మకు తన కెప్టెన్సీలో ఇండియాకు వన్డే వరల్డ్ కప్ తీసుకురావాలనే ఆలోచన బలంగా ఉంది. కానీ 2027 వరకు అతను కొనసాగుతాడా? కెప్టెన్‌గా ఉంచుతారా? అనేది ప్రశ్న. విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గౌతమ్ గంభీర్‌తో అతని ఈక్వేషన్ అంత బాలేదు. పైగా ఇటీవల రోహిత్ విరాట్ లేకుండానే ఇంగ్లాండ్ టెస్ట్ సిరిస్ ని డ్రా చేసి క్రిడెట్ గంభీర్ ఖాతాలోకి వెళ్ళింది. ఈ ఇద్దరూ లేకుండా వన్డే టీంని రెడీ చేయడానికి గంభీర్ ఉవ్విళ్ళూరుతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విరాట్, రోహిత్ ఇంకెంతకాలం కొనసాగుతారు, ఇంకెన్ని సిరీస్‌లు ఆడతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే రానున్న వన్డే వరల్డ్ కప్‌లో తాము లేమని తెలిసిన రోజే, ఈ ఇద్దరూ మిగిలిన ఆ ఒక్క ఫార్మాట్‌కీ గుడ్ బై చెప్పేయడం ఖాయం.