అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని విచారణ పూర్తయ్యే వరకూ రామ్మోహన్ నాయుడు పదవిలో ఉండకూడదని శరద్ పవార్ పార్టీ ఎమ్మెల్యే, రోహిత్ పవార్ అంటున్నారు. ఆయన రోజూ మీడియా సమావేశాలు పెట్టి అవే ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తన పదవిలో కొనసాగడం వల్ల ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, ఆయన తక్షణమే తప్పుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన విమానం VSR వెంచర్స్ కు చెందినదని.. ఆ సంస్థ యజమానులకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి మధ్య సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. . మంత్రి రామ్మోహన్ నాయుడు అదే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, విమాన సంస్థ యాజమాన్యాన్ని కాపాడేందుకు, దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. విమాన నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ సదరు సంస్థకు అనుమతులు ఎలా వచ్చాయనే దానిపై మంత్రి వివరణ ఇవ్వాలని, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన పట్టుబడుతున్నారు.
కేవలం రాజకీయ విమర్శలతోనే ఆగకుండా, విమానంలో ఇంధన ట్యాంకుల అమరిక మరియు బ్లాక్ బాక్స్ పనిచేయకపోవడం వంటి సాంకేతిక అంశాలను కూడా రోహిత్ పవార్ ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నప్పటికీ, ఈ కేసులో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి నిపుణులతో స్వతంత్ర విచారణ జరిపిస్తేనే అజిత్ పవార్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు వస్తాయని, అప్పటివరకూ మంత్రిని పదవి నుంచి తప్పించాలని రోహిత్ పవార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.
