‘రొమాంటిక్‌’ రివ్యూ : ఎరోటిక్ ప్రేమ కథ

 

పూరి జ‌గ‌న్నాథ్ క‌థ‌ల్లో కొత్త పాయింట్ ఎవ‌రూ వెద‌కరు. బ‌హుశా పూరీ కూడా… కొత్త‌గా ఏం చెబుదాం? అని ఆలోచించ‌డేమో…? ఉన్న ఆ క‌థ‌లోనే కాస్త మాసూ, కాస్త రొమాన్సూ… ఇంకాస్త వ‌యిలెన్సూ, మ‌రి చివ‌రాఖ‌రుకు మూడుంటే కాస్త ఎక్స‌లెన్సూ మిక్స్ చేసిన ఐటెమ్ ఒక‌టి అందిస్తాడు. ఈ పంప‌కాలు, వంట‌కాలు కుదిరితే…. సినిమా బ్లాక్ బ‌స్ట‌రు. లేదంటే అట్ట‌ర్ ఫ్లాప్‌. పూరి సినిమాల్లో ఇవి రెండే క‌నిపిస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ పూరి న‌డిచిన దారి అదే. కాక‌పోతే.. కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. కానీ ఇస్మార్ట్ శంక‌ర్ తో తేరుకోగ‌లిగాడు పూరి. ఆ సినిమా అటు పూరికీ, ఇటు రామ్ కీ మంచి బూస్ట‌ప్ అందించింది. అందులోనూ కొత్త‌ద‌న‌మేం లేదు. ఉన్న‌దీ మాస్‌, మ‌సాలా హంగామానే. లాజిక్కుల్ని రెండు గంట‌లు మ‌ర్చిపోయేలా చేయ‌గ‌ల‌గ‌డ‌మే… ఇస్మార్ట్ శంక‌ర్ విజ‌య ర‌హ‌స్యం. స‌రిగ్గా అలాంటి న‌మ్మ‌కంతోనే పూరి మ‌రో క‌థ రాసుకున్నాడు. అదే `రొమాంటిక్‌`. త‌ను ఎవ‌రి కోసం క‌థ రాశాడో తెలీదు గానీ, అది కాస్త‌.. త‌న‌యుడు ఆకాష్ పూరి పై ప్లే చేశాడు. అది అది పే చేసిందా? ప్ర‌భాస్, విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాకి చేసిన ప్ర‌మోష‌న్‌, ఇచ్చిన హైప్‌… ఈ సినిమాని నిల‌బెడుతుందా?

గోవాలో జ‌రిగే క‌థ ఇది. అక్క‌డ వాస్కోడి గామా (ఆకాష్ పూరి) ప‌క్కా ఆవారా. నాన్న ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. తన నిజాయ‌తీ వల్లే ప్రాణాలు కోల్పోతాడు. దాంతో వాస్కోడి గామా అనాథ గా మార‌తాడు. ఆ త‌ర‌వాత‌.. డ‌బ్బులు సంపాదించ‌డం కోసం అడ్డ‌దారులు తొక్క‌డం మొద‌లెడ‌తాడు. నాన‌మ్మ మేరి (ర‌మాప్ర‌భ‌) త‌ప్ప ఇంకెవ‌రూ లేరు. త‌న లాంటి అనాథ‌ల కోసం ఇళ్లు క‌ట్టించ‌డం త‌న ల‌క్ష్యం. అందుకోసం పెద్ద పెద్ద నేరాలు చేయాల‌నుకుంటున్నాడు. గోవాలో రెండు ముఠాల ఆధిప‌త్యం కొన‌సాగుతుంది. డ్ర‌గ్స్ దందా విచ్చ‌ల విడిగా కొన‌సాగుతుంటుంది. వాస్కోడిగామా ఓ గ్యాంగ్ లో చేరతాడు. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో, ఆ గ్యాంగ్ కే లీడ‌ర్ అవుతాడు. ఈ క్ర‌మంలో మోనిక (కేతిక శ‌ర్మ‌)ని చూసి మోహంలో ప‌డ‌తాడు. వాస్కోడిగామా గ్యాంగ్ జోరుని ఆప‌డానికి గోవాలో కొత్త‌గా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య‌ గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌). త‌ను సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. వాస్కోని ప‌ట్టుకుని, గ్యాంగ్ ని అంత‌మొందించ‌డ‌మే త‌న ల‌క్ష్యం. మ‌రి ఏసీపీ ర‌మ్య వ‌ల‌లో వాస్కో చిక్కాడా లేదా? మోనిక‌తో మోహం ఏమైంది? నిజానికి అది మోహ‌మా, ప్రేమా? ఈ విష‌యాలు తెలియాలంటే `రొమాంటిక్‌` చూడాలి.

పూరి మ‌రోసారి లాజిక్‌ల‌ను ప‌క్క‌న పెట్టి, మ్యాజిక్ పై న‌మ్మ‌కం ఉంచిన క‌థ ఇది. పూరి గ‌త సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మ‌ర్‌లో` అనే త‌త్వం హీరోది. అలాంటి క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటే సీన్లు ఎలా ప‌డ‌తాయో తేలిగ్గానే అర్థం చేసుకోవొచ్చు. పోలీస్ స్టేష‌న్ లో రౌడీ షీట‌ర్ తెరిచే సీన్ గానీ, డ్ర‌గ్స్ దందాలో అడుగుపెట్టిన వైనం గానీ – అచ్చంగా పూరి మార్కు కొల‌త‌ల‌తో సాగిపోతాయి. హీరోయిన్ ఎంట్రీ, త‌న వెనుక హీరో ప‌డే స‌న్నివేశాలు, వాళ్లిద్ద‌రి మ‌ధ్య మోహానికి సంబంధించిన సీన్లు… క‌చ్చితంగా యూత్ కి ఎక్కేస్తాయి. `రొమాంటిక్‌` అని పేరు పెట్టినందుకు రొమాన్స్ ని వేరే లెవిల్ లో చూపించాడు పూరి. `ఐ లైక్ దిస్ యానిమ‌ల్‌` అని హీరోయిన్ ని చూసి, హీరో అన‌డం – కాస్త ప‌ర్‌వ‌ర్టెడ్ అనిపిస్తుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా `ఏదో ఒక‌టి చేసేసుకుందాం` అనే ధ్యాస త‌ప్ప ప్రేమ ఉండ‌దు. పూరి కూడా అదే చెప్పాల‌నుకున్నాడు కాబ‌ట్టి… `ఇది మోహ‌మే` అని ఫిక్స్ అయిపోయి ఆ సీన్లు రాసుకున్నాడు కాబ‌ట్టి – స‌ర్దుకుపోవొచ్చు.

ఓ సాధార‌ణ‌మైన కుర్రాడు స‌డ‌న్ గా గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన వైనం పూర్తిగా సినిమాటిక్ గా అనిపిస్తుంది. కాక‌పోతే.. ఇక్క‌డ పూరి అల‌వాటు ప్ర‌కారం మ్యాజిక్ ని న‌మ్ముకుని సీన్లు రాసుకున్నాడు. ప్ర‌తీ సీన్ లోనూ పూరి మార్క్ డైలాగ్ ఒక‌టి ప‌డ‌డం, యాక్ష‌న్ సీన్ అవ్వ‌గానే హీరోయిన్ తో రొమాన్స్ మొద‌లెట్టేయ‌డం వ‌ల్ల‌.. కొన్ని త‌ప్పులు జ‌రిగినా క‌వ‌ర్ అయిపోయాయి. హీరోని నీచ్ క‌మీన్ కుత్తే టైపు పాత్ర‌లో చూపించాల‌నుకున్న‌ప్పుడు కూడా త‌న‌కో ఫ్లాష్ బ్యాక్ పెట్టాల‌ని, ఇలా మార‌డానికి ఓ కార‌ణం చూపించాల‌ని పూరి లాంటి ద‌ర్శ‌కుడు కూడా అనుకోవ‌డం ఎందుకో అర్థం కాదు. త‌ను రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ మ‌రీ రొటీన్ గా త‌యారైంది. హీరోకి ఓ ల‌క్ష్యం (పేద‌వాళ్ల‌కి ఇళ్లు క‌ట్టి ఇవ్వ‌డం) నిర్దేశించినంత వ‌ర‌కూ బాగానే ఉన్నా, దాన్ని క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టే అనిపిస్తుంది. ఇవేం లేకుండా పూరి ప్లెయిన్ గానూ క‌థ రాసుకోవొచ్చు.

ర‌మ్య గోవార్కర్ గా ర‌మ్య‌కృష్ణ ఎంట్రీ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. త‌న వాయిస్ ఓవ‌ర్ తోనే ఈ క‌థ మొద‌ల‌వుతుంది. పూర్త‌వుతుంది. ఓ ర‌కంగా ఈ పాత్ర‌తోనే క‌థ మొత్తం చెప్పించాడు పూరి. గోవార్క‌ర్ పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌ని ఎంచుకుని చాలా మంచి ప‌ని చేశాడు. ఆ పాత్ర‌కు ఓ హుందాత‌నం వ‌చ్చింది. కాక‌పోతే.. 482 బుల్లెట్లు ఎన్ కౌంట‌ర్లో వాడిన అంత‌టి పోలీస్ ఆఫీస‌ర్‌.. హీరో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి చేష్ట‌లూడిపోతుంది. పారిపోతుంటే.. `ఒరేయ్ ఆగ‌రా బాబూ` అంటూ బ‌తిమాలుతుంటుంది. ప్ర‌తీసారీ.. హీరోయిన్ ని అడ్డు పెట్టుకుని ప‌ట్టుకోవాల‌నుకుంటుంది. అదే… కుద‌ర్లేదు. ఫ‌స్టాఫ్‌లో `రొమాంటిక్‌` బండి.. కాస్త కుదుపుల‌తో నడిచిపోతుంది. సెకండాఫ్‌లో ఏమైనా ట్విస్టులు వ‌స్తాయ‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. కానీ అలాంటివేం లేకుండానే న‌డిపేశాడు. అక్క‌డ‌క్క‌డ పూరి మార్క్ హీరోయిజం, ఎమోష‌న్‌, డైలాగుల‌తో.. కాస్త కుస్తీ ప‌ట్లు ప‌ట్టాడు. ప‌తాక స‌న్నివేశాల్ని పూర్తిగా ఎమోష‌న‌ల్ గా మార్చేశాడు. ఈ క‌థ‌కు ఓ హ్యాపీ ఎండింగ్ ఇవ్వొచ్చు. కానీ.. పూరి మ‌ళ్లీ ఇక్క‌డ ప్రాధ‌మిక సూత్రాల్ని పాటించాల‌ని త‌ప‌న పడ్డాడు. ఓ రౌడీ షీట‌ర్ క‌థ ఇలానే ముగుస్తుంద‌న్న‌ట్టు క్లైమాక్స్ చిత్రీక‌రించాడు. అప్ప‌టి వ‌ర‌కూ హీరో పాత్ర‌ని ప్రేమించిన ప్రేక్ష‌కుడికి.. క్లైమాక్స్ కాస్త భారంగాఅనిపిస్తుంది.

మెహ‌బూబాతో పోలిస్తే రొమాంటిక్ లో ఆకాష్ లో మ‌రింత ప‌రిప‌క్వ‌త వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. బాడీ పెంచి మాస్ లుక్స్ లో క‌నిపించాడు. త‌న వాయిస్ ప్ల‌స్ పాయింట్. ఎలాంటి ఎమోష‌న్ అయినా త‌న గొంతులో ప‌లుకుతోంది. కొన్నిసార్లు.. పూరినే మాట్లాడుతున్నాడా? అనిపిస్తోంది. త‌న లోపం లేకుండా చేయ‌డానికి ఆకాష్ చాలా ప్ర‌య‌త్నించాడు. కానీ కొన్నిసార్లు ఇంత బ‌రువైన పాత్ర‌ని త‌ను మోయ‌లేక‌పోయాడేమో అనిపిస్తుంది. రెండేళ్లు ఆగి, ఈ క‌థ ఆకాష్ తో చేస్తే వేరే రేంజ్‌లో ఉండేది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొల‌వ‌ని ఓ కుర్రాడు, డాన్ అయిపోవ‌డం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయ‌డం.. అంత ఈజీగా నమ్మేట్టు ఉండ‌వు. కాక‌పోతే… భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా మంచి మాస్ హీరో అవుతాడు. క్లైమాక్స్‌లో త‌న న‌ట‌న మ‌రింత బాగుంది. కేతిక శ‌ర్మ లుక్స్ బాగున్నాయి. త‌న క్యారెక్ట‌ర్ ని కుర్ర‌కారుకి న‌చ్చేలా రాసుకున్నాడు పూరి. ముకుంద్ దేశ్ పాండే లాంటి న‌టుడ్ని స‌రిగా వాడుకోలేదు. ఉత్తేజ్ బాగా చేశాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.

పూరి సినిమాల్లో సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం బాగా క‌నిపిస్తుంది. ఇందులోనూ అంతే. సునీల్ క‌శ్య‌ప్ పాట‌ల్లో కొన్ని ఆక‌ట్టుకుంటాయి.`ఉండ‌లేనే` థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత కూడా వెంటాడుతుంది. పీనేకే బాద్‌.. పాట మంచి జోష్ తో సాగుతుంది. ఆ పాట‌లో రామ్, పూరి క‌నిపించ‌డంతో మ‌రింత జోష్ వ‌స్తుంది. ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.. పూరి మార్క్ డైలాగులు. ప్ర‌తీ సీన్ లో ఒక్క‌టైనా పేలేలా రాసుకున్నాడు. గోవా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా క‌ల‌ర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెర‌కెక్కించాడు కెమెరామెన్‌. పూరి రాసిన క‌థ‌నీ, పాత్ర‌ల్ని.. తెర‌పై వీలైనంత మాసీగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

ముందే చెప్పిన‌ట్టు… లాజిక్కులు లేని సినిమా ఇది. పూరి గ‌త సినిమాలు, అందులోని హీరో పాత్ర‌ల ప్ర‌వ‌ర్త‌న‌.. పూరి సిద్ధాంతాలు, జీవితంపై, ప్రేమ‌పై పూరికి ఉన్న ఫిలాస‌ఫీ.. ఇవ‌న్నీ మీకు బాగా న‌చ్చి, వాటిని మ‌రోసారి చూడాల‌నుకుంటే `రొమాంటిక్‌` చూడొచ్చు. కొన్ని స‌న్నివేశాలు కుర్ర‌కారుకి న‌చ్చేస్తాయి. వాళ్లే ఈ సినిమాకి శ్రీ‌రామ‌ర‌క్ష‌.

తెలుగు360 రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Swathi
Romantic Movie
51star1star1star1star1star

Most Popular

నాగ‌శౌర్య టైటిల్ ‘రంగ‌బ‌లి’?

ఇటీవ‌లే 'కృష్ణ వ్రింద విహారి'తో ఆక‌ట్టుకొన్నాడు నాగ‌శౌర్య‌. ఇప్పుడు ఓ కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ప‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీనికి 'రంగ‌బ‌లి' అనే ప‌వర్‌ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. 'రంగ' అనే...

రేపట్నుంచే విశాఖ నుంచి జగన్ పాలన చేస్తే ఎవరాపుతారు .. మినిస్టర్ !?

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై స్టే రాలేదు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నట్లుగా ఫలానా తేదీలోపు కట్టివ్వాలన్న అన్న అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ వైసీపీ నేతలు దాన్ని చిలువలు..పలువుగా చెప్పుకుంటున్నారు. స్టే...

నేనే వాళ్ల‌కు పోటీ: చిరంజీవి

చిరంజీవి సాధించిన అవార్డుల జాబితాలో మ‌రోటి చేరింది. ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాటిలీ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డుని చిరంజీవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గోవాలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ చల‌న చిత్రోత్స‌వాల్లో భాగంగా...

కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ – ఎవరీయన ?

ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో హఠాత్తుగా సీబీఐ అధికారులు రెయిడ్ చేసి... కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే.. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయాలని.. హైదరాబాద్, విశాఖ సీబీఐ...

HOT NEWS

Swathi
Romantic Movie
51star1star1star1star1star
css.php
[X] Close
[X] Close