మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న రోశయ్యకు భద్రత మరింత పెంచారు! అలా అంటే కంటే.. ఆయనే పెంచుకున్నారు అని చెప్పడం కరెక్ట్! భద్రతా సిబ్బంది విషయంలో రోశయ్య ఎందుకు పట్టుదలతో ఉన్నారో తెలీదుగానీ… అంగరక్షకులను పెంచాలంటూ ఈ మధ్య ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్కు కూడా తన భద్రత గురించి చెప్పారు! ఏదైతేనేం అనుకున్నది సాధించుకున్నారు.
తమిళనాడు గవర్నర్గా రోశయ్య పదవీకాలం ఈ మధ్యనే పూర్తయింది. తమిళనాడు సర్కారు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. అనంతరం, ఆయన హైదరాబాద్ వచ్చారు. వచ్చీరాగానే ఆయనకు ఇద్దరు గన్మెన్ మాత్రమే భద్రతగా ఉండటం కనిపించింది! ఇన్నాళ్లూ తన చుట్టూ భారీ ఎత్తున భద్రతా సిబ్బంది ఉండటం అనుభవమైన రోశయ్యకు… ఇకపై ఇద్దరే సెక్యూరిటీ అనేసరికి ఏమనిపించిందో ఏమో..? ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిగా ఉంటుండగానే… అనూహ్యంగా వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత, వెంటనే తమిళనాడు గవర్నర్గా మన్మోహన్ సర్కారు ఆయన్ని పంపించింది. దీంతో ఏ పదవిలో ఉన్నా భారీ భద్రతా సిబ్బంది వెంట ఉండేది. ఇప్పుడు అవన్నీ ఒకేసారికి కనిపించకపోయేసరికి ఏదో లోటు ఫీలై ఉంటారు.
తనకు భద్రత పెంచాలంటూ రాష్ట్రపతికీ, గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేశారు. స్పందించిన తెలంగాణ సర్కారు రోశయ్యకు సెక్యూరిటీ పెంచింది. దీంతో రోశయ్య తీరుపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఆయనకంటూ శత్రువులు ఎవ్వరూ లేరనే అంటారు. పైగా, గవర్నర్గా తమిళనాడు వెళ్లిన తరువాత ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత లేకుండా పోయింది. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిని అనే ఒక ఫీలింగ్ తప్ప… పార్టీలో కూడా ప్రస్తుతం రోశయ్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటే… అదీ చెప్పలేం! ఇలాంటి పరిస్థితుల్లో భద్రత గురించి ఎందుకంత ఆందోళన అనేది కొందరి ప్రశ్న? ఉన్న ఇద్దరు గన్మెన్లూ సరిపోతారు కదా! భారీ భద్రతా సిబ్బందిని వెంటేసుకుని తిరగడం అనేది ఒక హోదా అని ఆయన భావిస్తున్నారేమో అని కూడా కొంతమంది అంటున్నారు.