‘నిర్మలా కాన్వెంట్’, ‘రుద్రమదేవి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. ఇప్పుడు ‘ఛాంపియన్’తో తనలోని అన్ని కోణాల్నీ చూపించగలిగాడు. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? ఆర్థికంగా ఎంత రాబట్టింది? అనే విషయాలు పక్కన పెడితే.. హీరోగా రోషన్‌కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. డాన్స్, ఫైట్స్, పెర్ఫార్మెన్స్.. ఇలా అన్ని కోణాల్నీ కవర్ చేయగలిగాడు. రోషన్ లో ఓ మంచి కమర్షియల్ హీరో ఉన్నాడన్న సంగతి ప్రేక్షకులకు అర్థమైంది. దర్శకులూ అలాంటి కథల్ని రెడీ చేస్తున్నారు. ‘ఛాంపియన్’ తరవాత రోషన్‌కు కథల తాకిడి ఎక్కువైంది. కొంతమంది అగ్ర దర్శకులు కూడా కథలు వినిపించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో రోషన్ తన తదుపరి సినిమాపై సంతకాలు చేశాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
`హిట్` చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో రోషన్ సినిమా ఫిక్సయ్యింది. సితార, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో అధికారిక ప్రకటన వస్తుంది. షూటింగ్ కి మాత్రం కొంత సమయం పడుతుంది. వేసవిలో ఈ సినిమా పట్టాలెక్కించే వీలుంది. ఈలోగా రోషన్ కొంత విరామం తీసుకొంటాడు. ‘పెళ్లి సందడి’ తరవాత మూడేళ్లు గ్యాప్ తీసుకొన్నాడు రోషన్. ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యాడు. శైలేష్ కొలను యాక్షన్ కథల్ని బాగా హ్యాండిల్ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం ఓ రొమాంటిక్ కామెడీ కథని ఎంచుకొన్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాలి.
