రివ్యూ: ఆర్‌.ఆర్‌.ఆర్‌

RRR Movie review

తెలుగు360 రేటింగ్‌: 3.5/5

రాజ‌మౌళి ఏం చేయ‌గ‌ల‌డో? ఎంత చేయ‌గ‌ల‌డో? ఈరోజు ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది?
ముఫ్ఫై, న‌ల‌భై కోట్లు అంటూ గిరి గీసుకున్న తెలుగు సినిమాని వంద‌, వేయి కోట్ల సినిమాగా మార్చేయ‌గ‌ల‌డు.
ఓ తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేయ‌గ‌ల‌డు.
బాలీవుడ్ అంతా, మ‌న చాతుర్యాన్ని చూసి ముక్కున వేలేసుకునేలా ఏమార్చ‌గ‌ల‌డు.

సినిమా సినిమాకీ త‌నే ఓ కొత్త టార్గెట్ నిర్దేశించుకుని, త‌న సినిమాని తానే బ్రేక్ చేసుకుంటూ.. తాను ఎదుగుతూ, త‌న సినిమాని పైపైకి తీసుకెళ్తూ, దాంతో పాటుగా తెలుగు సినిమా జెండాని దేశ‌మంతా క‌నిపించేలా రెప‌రెప‌లాడించ‌గ‌ల‌డు. బాహుబ‌లితో.. భాష‌ల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్ని చెరిపేశాడు రాజ‌మౌళి. ఇప్పుడు ఇద్ద‌రు స్టార్ హీరోలు, టాప్ హీరోలు, ఒకే త‌రం హీరోల్ని తీసుకొచ్చి, మ‌ల్టీస్టార‌ర్ చేసి `ఆర్‌.ఆర్‌.ఆర్‌`గా మ‌న ముందుకు తీసుకొచ్చాడు. ఎప్పుడో పూర్తయిన సినిమా ఇది. ఎప్పుడో రావ‌ల్సిన సినిమా ఇది. మ‌ధ్య‌లో ఎన్నో అవాంత‌రాలు వ‌చ్చాయి. బ‌డ్జెట్లు పెరిగాయి. ఇద్ద‌రు హీరోలు మ‌రో సినిమా చేయ‌కుండా మూడేళ్ల పాటు కేవ‌లం `ఆర్‌.ఆర్.ఆర్‌`కే అంకిత‌మైపోవాల్సివ‌చ్చింది. అయినా స‌రే – `ఆర్‌.ఆర్‌.ఆర్‌`పై మ‌క్కువ పెరిగిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. దానికి కార‌ణం.. ఇది రాజ‌మౌళి సినిమా. కాక‌పోతే.. ఇద్ద‌రు స్టార్ హీరోల్ని ఎలా బాలెన్స్ చేయ‌గ‌ల‌డు? కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్ని తీసుకొచ్చి త‌న క‌ల్పిత క‌థ‌లో ఎలా ఇమ‌డ్చగ‌ల‌డు? అనేవే ప్ర‌శ్న‌లు. ఈ లెక్క‌లు తేలే రోజు వ‌చ్చేసింది. ఆర్‌.ఆర్‌.ఆర్ మ‌న ముందుకొచ్చేసింది. మ‌రి… ఈ సినిమా ఎలా ఉంది? రాజ‌మౌళి ఈసారి త‌న క‌ల‌ల్ని ఏ స్థాయిలో చూపించ‌గలిగాడు?

బ్రిటీష్ ప‌రిపాల‌నా కాలం అది. అప్ప‌ట్లో హైద‌రాబాద్ సంస్థానం నిజాం న‌వాబుల చేతిలో ఉండేది. నిజాం నవాబుని చూడ్డానికి వ‌చ్చిన ఓ బ్రిటీష్ దొర‌.. గోండు జాతి పిల్ల‌ని త‌మ‌తో పాటు ఢిల్లీకి తీసుకెళ్లిపోతాడు. ఆ గోండుజాతిని ర‌క్షించే కాప‌రే.. భీమ్ (ఎన్టీఆర్‌). ఆ పాప‌ని బ్రిటీష్ వారి నుంచి తీసుకురావ‌డానికి ఢిల్లీ వెళ్లి, అదును కోసం ఎదురు చూస్తుంటాడు. బ్రిటీష్ ప్ర‌భుత్వంలో పోలీస్ ఆఫీస‌ర్ గా ప‌నిచేస్తుంటాడు రామ్ (రామ్ చ‌ర‌ణ్). చాలా నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తుంటాడు. ప్ర‌భుత్వం గుర్తించి.. త‌న‌కు ప‌దోన్న‌తి ఇస్తుందేమో అన్న చిన్న ఆశ‌… రామ్‌ది. త‌మని ఎదిరించి, పాప‌ని ఎత్తుకెళ్ల‌డానికి ఓ గోండు జాతి వీరుడొచ్చాడ‌ని తెలిసి, అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి రామ్ ని నియ‌మిస్తుంది బ్రిటీష్‌ ప్ర‌భుత్వం. అయితే… ఆ తిరుగుబాటు దారుడు భీమ్ అనే సంగ‌తి తెలీక‌.. త‌న‌తో దోస్తీ చేస్తాడు రామ్. ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. భీమ్ ల‌క్ష్యం ఆ పాప‌ని చెర నుంచి ఎత్తుకెళ్లిపోవ‌డం. రామ్ ఆశయం.. భీమ్‌ని బంధీని చేయ‌డం. మ‌రి ఇవి రెండూ జ‌రిగాయి. ఈ దోస్తీ ఎప్ప‌టి వ‌ర‌కూ కొన‌సాగింది… రామ్ వెనుక క‌థేమిటి? రామ్ కోసం ఎదురు చూస్తున్న సీత (అలియాభ‌ట్‌) ఎవ‌రు..? ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్‌.. వీరిద్ద‌రూ వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన స‌మ‌ర‌యోధులు. ఇద్ద‌రూ క‌లుసుకున్న‌ట్టు చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేదు. కానీ… ఇద్ద‌రూ క‌లుసుకుంటే, స్నేహం చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో రాసుకున్న క‌థ ఇది. వీరిద్ద‌రూ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ కాక‌పోవ‌డం వ‌ల్ల క‌థేం మారిపోదు. ఇద్ద‌రు దేశ‌భ‌క్తుల క‌థ అనుకున్నా స‌రిపోతుంది. కానీ… ఒక‌రు కొమ‌రం భీమ్‌, ఇంకొక‌రు అల్లూరి అవ్వ‌డం వ‌ల్ల‌… ఆ పాత్ర‌లకంటూ ఓ ఔచిత్యం ముందే వ‌చ్చేసింది. వాళ్ల‌ని కావ‌ల్సినంత ఎలివేట్ చేయ‌డానికి, ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టు చూపించ‌డానికి రాజ‌మౌళికి లైసెన్స్ దొరికేసిన‌ట్టైంది. రాజ‌మౌళిది ఇది భ‌లే ఎత్తుగ‌డ‌. కొమ‌రం భీమ్ ది తెలంగాణ‌. అల్లూరిది ఆంధ్రా. అలా.. త‌న‌కు తెలియ‌కుండానే రెండు ప్రాంతాల‌కు ముడి వేసేశాడు. అది బ్ర‌హ్మ‌ముడి అయిపోయింది.

ఆర్‌.ఆర్‌.ఆర్ లోని ఒకొక్క అక్ష‌రాన్ని స్టోరీ, ఫైర్‌, వాట‌ర్‌…. ల‌ను ప‌రిచ‌యం చేసిన‌చ విధానం రాజ‌మౌళిలోని స్క్రీన్ ప్లే ప్ర‌జ్ఞ‌త‌కు నిద‌ర్శ‌నం. ముందు కొంత క‌థ చెప్పాడు. ఆ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్‌ని ప‌రిచ‌యం చేశాడు. ఆ వెంట‌నే.. ఎన్టీఆర్ వ‌చ్చాడు. రాజ‌మౌళి త‌న హీరోల్ని అమితంగా ప్రేమిస్తాడు. త‌న హీరోల ప‌రిచ‌య దృశ్యాలు మాస్‌కి బాగా ఎక్కేస్తాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌,చ‌ర‌ణ్‌ల‌ను ప‌రిచ‌యం చేసిన స‌న్నివేశాలైతే.. ఆయా హీరోల అభిమానుల‌కు గూజ్‌బ‌మ్ మూమెంట్స్ అందిస్తాయి. ఒక్కో ఎపిసోడ్ క‌నీసం 10 నిమిషాలైనా ఉంటుంది. కానీ… అస్స‌లు టైమే తెలీదు. అది రాజ‌మౌళి మేజిక్కు.

హీరోలిద్ద‌రినీ ప‌రిచ‌యం చేశాక‌.. వాళ్లిద్ద‌రూ ఎలా ఫ్రెండ్స‌య్యారో చూపించాలి. అందుకోసం చాలా సాధార‌ణ‌మైన ఎపిసోడే రాసుకున్నాడు. ఓ బాబు నీళ్ల‌లో ప‌డిపోతాడు. కాపాడాలి అంతే. ఇద్ద‌రు హీరోలూ క‌లిసి ఆ బాబుని కాపాడ‌తారు. అంతే సీన్‌. చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు చూసేశాం. కానీ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో మాత్రం.. ఈ ఎపిసోడ్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌లా అనిపిస్తుంది. ఇద్ద‌రు హీరోలు… తాళ్లు ప‌ట్టుకుని వేళాడుతుంటే… అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చేస్తాయి. ఆ త‌ర‌వాత‌.. వారిద్ద‌రి మ‌ధ్యా దోస్తీ మొద‌లైపోతుంది. క‌థ ఇక్క‌డ కాస్త స్లో అయ్యింద‌న్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి క‌లిగేలోపే.. ఓ ఊహ‌కంద‌ని ఎపిసోడ్ ని దించేస్తుంటాడు రాజ‌మౌళి. ఆ లెక్క ఆర్‌.ఆర్‌.ఆర్‌లోనూ త‌ప్ప‌లేదు. సినిమా బండి నిదాన‌మైంది అనుకుంటున్న‌ప్పుడు నాటు…నాటు పాటేసుకున్నాడు. ఆ పాట‌లో రాజ‌మౌళి చాలా విష‌యాలే చెప్పాడు. హీరోల మ‌ధ్య స్నేహాన్ని చూపించే ఛాన్స్ ఈ పాట‌లోనూ తీసుకున్నాడు.

క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ చూపించాల్సిన చోట‌.. రాజ‌మౌళి ఎప్పుడూ త‌డ‌బ‌డ‌డు. అక్క‌డ ఎమోష‌న్స్‌ని పీక్స్ కి తీసుకెళ్తాడు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ చూస్తే రాజ‌మౌళి స‌క్సెస్ ఫార్ములా అర్థ‌మైపోతుంది. ఇద్ద‌రు హీరోలు కొద‌మ సింహాల్లా పోటీ ప‌డుతుంటే.. ఓ వైపు ఉద్వేగం, ఓ వైపు బాధ క‌లిసొచ్చేస్తాయి. రామ్ వైపు త‌ప్పు క‌నిపించ‌దు. భీమ్ ఆవేశంలోనూ దోషం ఉండ‌దు. ఆ రెండు పాత్ర‌ల్నీ ఓ స్థాయికి తీసుకెళ్లి, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా సంఘర్ష‌ణ చూపించిన విధానం.. విస్మ‌య‌ప‌రుస్తుంది. ఆ దిగ్భ్రాంతిలోనే `విశ్రాంతి` కార్డు వేస్తాడు.

ఇంట్ర‌వెల్‌కే.. టికెట్ రేటు గిట్టుబాటైపోయేంత వినోదం ఇచ్చాడు రాజ‌మౌళి. పూర్తి స్థాయిలో విందు భోజ‌నం చేసిన సంతృప్తి క‌లుగుతుంది. ద్వితీయార్థంపై మ‌రింత అంచ‌నాలు పెరుగుతాయి. అయితే.. సెకండాఫ్ లో అనుకున్నంత వేగం క‌నిపించ‌దు. ఇంట్ర‌వెల్ ని ఓ స్థాయి ఎమోష‌న్‌కి తీసుకెళ్లిన రాజ‌మౌళి.. అక్క‌డి నుంచి ప్రేక్ష‌కుడ్ని కింద‌కు దించి అస‌లు క‌థ చెప్ప‌డం ప్రారంభిస్తాడు. అస‌లు క‌థెప్పుడూ కాస్త బోర్ కొట్టే వ్య‌వ‌హార‌మే. ఇక్క‌డా అదే జ‌రిగింది. రామ్ ఫ్లాష్ బ్యాక్ లో మెరుపులేం ఉండ‌వు. ఆ ఎపిసోడ్ తో రామ్ ఆశ‌యం అర్థం అవుతుంది. ఆ పాత్ర‌పై సానుభూతి, ప్రేమ పెరిగేందుకు దోహ‌దం అవుతుంది. దాదాపు 20 నిమిషాల పాటు ఆ ఓల్డ్ డ్రామా అలా ర‌న్ అవుతూనే ఉంటుంది. ఆ త‌ర‌వాత `కొమ‌రం భీముడా` పాట‌తో మ‌ళ్లీ ఎమోష‌న్ ట‌చ్‌లోకి వ‌చ్చేశాడు రాజ‌మౌళి. భీమ్ ఉరికంబం ఎక్కించిన‌ప్పుడు రామ్ త‌ప్పించే స‌న్నివేశం బాగానే ఉన్నా, ఇది వ‌ర‌క‌టి యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పోల్చుకుంటే తేలిపోతుంది. రామ్ క‌థ తెలుసుకున్న త‌ర‌వాత‌… రామ్ ని వెదుక్కుంటూ భీమ్ రావ‌డం, రామ్.. భీమ్ ను భుజాల‌పై వేసుకుని ప‌ర‌గులు తీయ‌డం.. ఆ కాంబినేష‌న్‌లో ఓ ఫైట్ సెట్ చేయ‌డం.. మాస్‌కి పండ‌గ‌లాంటి మూమెంట్‌. స‌రిగ్గా ఇదే ఫైట్ లో.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గా ద‌ర్శ‌న‌మిస్తాడు. ఎలివేష‌న్స్ సీన్స్ లో త‌న‌కు తిరుగులేద‌ని అల్లూరి గెట‌ప్ లో రామ్ చ‌ర‌ణ్ ని రివీల్ చేసిన త‌ర‌వాత‌.. మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు అర్థం అవుతుంది. క్లైమాక్స్ త్వ‌ర‌గా ముగించిన ఫీలింగ్ వ‌స్తుంది. అక్క‌డ కూడా `రాజ‌మౌళి ఇంకేదో చేస్తాడు` అని ఎదురు చూసిన ప్రేక్ష‌కుల‌కు కాస్త నిరాశ ఎదుర‌వుతుంది. `ఉత్త‌ర జెండా` పాట‌తో ఆ నిరాశ కాస్త తగ్గించి, జోష్ ఇచ్చి.. థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు పంపాడు రాజ‌మౌళి.

ఇది ఇద్ద‌రు హీరోల క‌థ‌. సాధార‌ణంగా మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే.. ఓ పాత్ర ఎక్కువ‌, మ‌రో పాత్ర కాస్త త‌క్కువ అయ్యే ప్ర‌మాదం ఉంది. కానీ.. ఈ సినిమాలో ఆ త‌ప్పు జ‌ర‌గ‌లేదు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ పాత్ర‌ల్లో ఎవ‌రెక్కువ‌, ఎవ‌రు త‌క్కువ అంటే ట‌క్కున చెప్ప‌లేం. ఇద్ద‌రూ స‌మానమే. ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌కు అద్భుతంగా న్యాయం చేశారు. ఇద్ద‌రి కెరీర్‌లోనూ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అందించారు. ఒక సీన్‌లో చ‌ర‌ణ్ హైలెట్ అయితే, మ‌రో సీన్‌లో ఎన్టీఆర్ అయ్యాడు. ఇద్ద‌రూ ఒకే సీన్‌లో రెచ్చిపోయిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అవ‌న్నీ అభిమానుల‌కు పండ‌గ‌లాంటి స‌న్నివేశాలే. ఇద్ద‌రూ నాటు – నాటు పాట‌కు నాటు స్టెప్పులేస్తే.. థియేట‌ర్ మొత్తం ఊగిపోయింది. అలియా భ‌ట్ పాత్ర ప‌రిధి చాలా త‌క్కువ‌. కాక‌పోతే.. క్లైమాక్స్ లో రామ్ ఎలాంటివాడో భీమ్ తెలుసుకోవ‌డానికి ఆ పాత్ర కీల‌కంగా మారింది. స‌ముద్ర‌ఖ‌నికీ చాలా త‌క్కువే స్పేస్ ఉంది. బ్రీటీష్ దొర విల‌నిజం.. స‌రిగా ఎలివేట్ అవ్వ‌లేదు.

త‌న సినిమాని విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్ద‌డం రాజ‌మౌళికి అల‌వాటు. ఈసినిమాలోనూ అదే జ‌రిగింది. విజువ‌ల్స్ అదిరిపోయాయి. గ్రాఫిక్స్ బాగా కుదిరాయి. కీర‌వాణి పాటలు, ఇచ్చిన నేప‌థ్య సంగీతం, ఆర్ట్ డిపార్ట్ మెంట్‌.. ఇవ‌న్నీ క‌థ‌కు బాగా హెల్ప్ అయ్యాయి. బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు క‌థ‌కు, పాత్ర‌ల‌కు అనుగుణంగా సాగాయి. మ‌రీ ఓవ‌ర్ డ్రామా లేదు. ఈ సినిమాకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ రాజ‌మౌళినే. త‌ను లేక‌పోతే.. ఆర్‌.ఆర్‌.ఆర్ లేదు. త‌న విజ‌న్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తొలి స‌గం.. ప‌క్కా రాజ‌మౌళి సినిమా స్కేల్ తో సాగిపోతుంది. సెకండాఫ్‌లో కాస్త స్లో అయినా.. మెల్లగా రాజ‌మౌళి ట్రాక్ ఎక్కేశాడు. మొత్తానికి కొన్ని రోజుల పాటు… థియేట‌ర్ల‌లో జాత‌ర చేయించి, తెలుగు సినిమా గురించి బాలీవుడ్ వాళ్లు కూడా గొప్ప‌గా చెప్పుకొనే అవ‌కాశం క‌ల్పించాడు రాజ‌మౌళి.

ఫినిషింగ్ ట‌చ్‌: కుంభ‌స్థ‌లం బ‌ద్ద‌లైంది

తెలుగు360 రేటింగ్‌: 3.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close