ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. బాధితుడిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తూంటే హాజరు కావడం లేదు. పైగా తనకు నోటీసులు రాక ముందే మీడియాకు తెలిశాయని.. సంబంధం లేని అంశాలపై ఆరోపణలు చేస్తున్నారు.
సిట్ విచారణకు హాజరైతే.. ఆయన బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్లను ట్యాప్ చేసిన వాయిస్ రికార్డులను వినాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీలోనే ఉన్నందున.. ా ఫోన్ రికార్డులు విని..తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పలేరు. అలా చెబితే కేసీఆర్కు కోపం వస్తుంది. అందుకే జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు భవిష్యత్ ముఖ్యం అని.. ఎలాంటి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు. పైగా రివర్స్ లో సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని..సీబీఐకి ఇవ్వాలంటున్నారు. అదే సమయంలో.. మంత్రుల ఫోన్లు, రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేయిస్తున్నారని విచిత్రమైన ఆరోపణలు చేయిస్తున్నారు.
ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతూ ఉంటే.. దానికి తగ్గట్లుగా ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చు. ప్రవీణ్ కుమార్ పోలీసు అధికారిగా పని చేశారు. ట్యాపింగ్ చేస్తూ ఉంటే.. ఎలా పట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో కానీ.. తన ఫోన్ ట్యాప్ చేసి విన్న వాళ్లకు మద్దతుగా ఆయన మాట్లాడాల్సి రావడం.. నిజంగా విపత్కర పరిస్థితే. అదే బీఎస్పీకి అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఆయన రాజకీయ భవిష్యత్ వేరేలా ఉండేదమో ?