హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పశ్చిమ దిశగా శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్‌గా పేరొందిన గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాల్లో భూముల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి పటాన్చెరు సమీపంలోని రుద్రారం వైపు మళ్లింది. ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు పొందిన రుద్రారం, ఇప్పుడు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు , భారీ టౌన్షిప్లకు చిరునామాగా మారుతోంది.
ముంబై జాతీయ రహదారి పై ఉండటం, అభివృద్ధికి పుష్కలమైన భూమి అందుబాటులో ఉండటంతో ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారు.
రుద్రారం ప్రాంతానికి ఉన్న అతిపెద్ద బలం ఔటర్ రింగ్ రోడ్ ,రాబోయే రీజినల్ రింగ్ రోడ్ కు అత్యంత సమీపంలో ఉండటమే. ఈ వ్యూహాత్మక భౌగోళిక స్థితి వల్ల ఇక్కడ నుండి గచ్చిబౌలి ఆర్థిక జిల్లాకు కేవలం 20-30 నిమిషాల్లో చేరుకునే వెసులుబాటు ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇక్కడ వందల ఎకరాల్లో భారీ వెంచర్లను ప్రారంభిస్తున్నాయి. కోకాపేటలో నియో-పొలిస్ తరహాలో ఇక్కడ కూడా అత్యాధునిక స్కై స్క్రాపర్లు, వాణిజ్య సముదాయాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, విద్యా, పారిశ్రామిక హబ్‌గా కూడా రుద్రారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గీతం యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు, తోషిబా వంటి బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఇక్కడ కొలువై ఉన్నాయి. దీనికి తోడు మెట్రో రైలును పటాన్చెరు వరకు పొడిగించాలనే ప్రతిపాదనలు ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాన్ని ఇస్తోంది. ఐటీ ఉద్యోగులు తక్కువ ధరలో విల్లాలు లేదా లగ్జరీ అపార్ట్మెంట్లు కోరుకునే వారికి రుద్రారం ఇప్పుడు మొదటి ఛాయిస్‌గా నిలుస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ భూముల ధరలు రెట్టింపు అయ్యాయి.
ప్రస్తుత ధోరణిని గమనిస్తే, భవిష్యత్తులో రుద్రారం పశ్చిమ హైదరాబాద్‌కు మరో కీలక ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక కాలుష్యంపై ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోవడం, గ్రీన్ జోన్ల పెంపుపై బిల్డర్లు శ్రద్ధ చూపడం వల్ల ఇక్కడ గృహ కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోంది.


