అక్టోబరు 2 దసరా సందర్భంగా ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైంది. ఈ సినిమాలోని రిషబ్ శెట్టి నటన గురించి, క్లైమాక్స్ గురించీ, ఆ విజువల్స్ గురించి గొప్పగా మాట్లాడుకొంటున్నారు. దాంతో పాటు కథానాయిక రుక్మిణి వసంతన్ కూ మంచి మార్కులు పడ్డాయి. తన క్యారెక్టర్ ఆర్క్ బాగుంది. నటనతోనూ కట్టి పడేసింది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ‘డ్రాగన్’ లో తనే హీరోయిన్. `సప్త సాగరాలు దాటి` సినిమాలో రుక్మిణి వసంతన్ ప్రతిభ చూసిన దర్శకుడు ప్రశాంత్ నీల్… ‘డ్రాగన్’ లో ఆమెను కథానాయికగా ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ‘సప్తసాగరాలు’ జనాదరణ పొందలేదు. పైగా కమర్షియల్ హీరో ఎన్టీఆర్ పక్కన రుక్మిణి సరిపోతుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యేవి. ‘కాంతార చాప్టర్ 1’ తో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఎన్టీఆర్ తో రుక్మిణి కెమిస్ట్రీ బాగానే పండుతుందని అభిమానులు నమ్మకాలు పెట్టుకొన్నారు.
‘కాంతార చాప్టర్ 1’ రుక్మిణికి చాలా కీలకమైన సినిమా. ఇది హిట్టయితే కమర్షియల్ సినిమాలకు తను మంచి ఆప్షన్ అవుతుందని తనకు ముందే తెలుసు. అందుకే ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ చేసింది. ఎన్ని డేట్లు కావాలంటే అన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం కొన్ని ఆఫర్లు పక్కన పెట్టింది. ఇవన్నీ తనకు కలిసొచ్చాయి. ప్రస్తుతం యశ్ పక్కన ఓ సినిమాలో నటిస్తోంది రుక్మిణి. ‘కాంతార’ ఎఫెక్ట్ వల్ల.. తనకు మరిన్ని మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. తెలుగులో అయితే.. యూత్ హీరోలకు తను మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.