రివ్యూ: రూల‌ర్‌

తెలుగు 360 రేటింగ్ 1.5/5

‘నేను మిమ్మ‌ల్ని ఎక్క‌డికో తీసుకెళ్దామ‌నుకుంటాను.. అక్క‌డికి మీరు రారు’
– ఓ తెలుగు సినిమాలోని పాపుల‌ర్ డైలాగ్ ఇది.
సినిమాని కూడా చాలామంది ఎక్క‌డెక్క‌డికో తీసుకెళ్తున్నారు.
కొన్ని ఐడియాలు చూస్తే.. వావ్ అనిపిస్తున్నాయి.
ఇలాంటి క‌థ‌తో సినిమాలు తీయొచ్చా..? అని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.
తెలుగువాళ్లూ ఈ విష‌యంలో రాటు తేలుతున్నారు.
కొంత‌మంది మాత్రం ఇంకా `అక్క‌డే` ఉంటారు. `రండ్రా బాబూ` అన్నా రారు. `మారండ్రా` అన్నా మార‌రు.
అదే ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీస్తుంటారు. అలాంటి ద‌ర్శ‌కుల‌లో కె.ఎస్‌.ర‌వికుమార్ ఒక‌రు.
క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌ని మిల్లీమీట‌ర్ కూడా దాట‌కుండా క‌థ‌లు అల్లేస్తుంటారు.

ఓ పాట‌, ఫైటు, రొమాన్సు, మ‌ధ్య‌లో కామెడీ, మ‌ళ్లీ పాట, ఫైటు… ఇలా ముక్క‌లు ముక్క‌లుగా సినిమాని అతికించేస్తుంటారు. బాల‌కృష్ణ‌తో తీసిన `జై సింహా` కూడా ఇదే రూలు ఫాలో అయిన సినిమానే. అది ఆడింది. ఇప్పుడు అదే న‌మ్మ‌కంతో `రూల‌ర్‌` తీశారు. మ‌రి ఇదేమైంది??

క‌థ‌

ఈ సినిమా కోసం ర‌చ‌యిత క‌మ్ ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి ప‌నిగ‌ట్టుకుని క‌థ రాశారంటే – సినిమా చూసొచ్చాక మాత్రం ఎవ‌రూ న‌మ్మ‌రు. కొన్ని తెలుగు సినిమాల్ని చూసి అక్క‌డో ముక్క‌, ఇక్క‌డో ముక్క అనుకుని క‌ట్ చేసి, దాన్ని పేప‌ర్ మీద పేస్ట్ చేసుంటారు. అంతే. ఈ సినిమాని చాలా తొంద‌ర‌గా తీయాల‌ని బాల‌య్య గ‌ట్టిగా ఫిక్స‌యిపోయి ఉంటాడు. అందుకే క‌థ విష‌యంలో ద‌ర్శ‌కుడికి స‌మ‌యం చిక్క‌లేద‌నుకుంటా. కాక‌పోతే సెట్లో కూర్చుని రాసుకున్నా – ఇంత‌కంటే మంచి క‌థే దొరికేది.

ఏమైనా స‌రే.. క‌థ‌లోకి వెళ్లాలి కాబ‌ట్టి, వెళ్లిపోదాం. స‌రోజిని దేవి (జ‌య‌సుధ) అనే ఓ వ్యాపార‌వేత్త‌ని రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ప‌డి ఉన్న వ్య‌క్తి (బాల‌కృష్ణ‌) ఎదుర‌వుతాడు. ఆసుప‌త్రిలో చేర్పిస్తుంది. ఆ పేషెంటు కోమాలోకి వెళ్లిపోతాడు. అయితే స‌రోజినిదేవినే ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు కోమాలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఆమెను కాపాడి మ‌ళ్లీ కోమాలోకి వెళ్లిపోతాడు. (ఇదెలా సాధ్యం అని అడ‌క్కండి).

దాంతో త‌న ప్రాణాలు కాపాడినందుకు ప్ర‌తిగా అత‌ని ప్రాణాలు కాపాడి.. అర్జున్‌ ప్రసాద్‌ అని నామ‌క‌ర‌ణం చేస్తుంది. త‌న కంపెనీకి సీఈఓగానూ మార్చేస్తుంది. మ‌రోవైపు యూపీలోని తెలుగువాళ్లని అక్క‌డి మంత్రి భ‌వానీనాథ్ ఠాకూర్ చిత్ర‌హింస‌లకు గురి చేస్తుంటాడు. అక్క‌డ ఏదైనా కంపెనీ పెట్టాల‌న్నా త‌న‌కు వాటా ఇవ్వాల్సిందే. అదే ప్రాంతంలో ఓ సోలార్ ఫ్యాక్ట‌రీ పెట్టాల‌ని యూపీలోకి అడుగుపెడ‌తాడు అర్జున్‌ ప్రసాద్‌. అయితే అక్క‌డి ప్ర‌జ‌లు అర్జున్‌ ప్రసాద్‌ని గుర్తు ప‌డ‌తారు. ధ‌ర్మ‌.. అని పిలుస్తారు. ఆ ధ‌ర్మ ఎవ‌రు? ఆ ధ‌ర్మ‌కీ, భ‌వానీ ప్ర‌సాద్‌కి ఉన్న లింకేంటి? యూపీలోని తెలుగువాళ్ల‌ని ఠాకూర్ చెర నుంచి ఎలా ర‌క్షించాడు? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

బాలయ్య సినిమాలో మాత్ర‌మే చూసే వింత‌లూ విడ్డూరాలు, వాటి మ‌ధ్య కొన్ని యాక్ష‌న్ సన్నివేశాలు, ముత‌క కామెడీ.. ఇవ‌న్నీ క‌లిపి ఓ సినిమా మ‌లిస్తే అదే రూల‌ర్‌. అస‌లు ఆ పేరుకీ, ఈ సినిమా క‌థ‌కీ సంబంధం ఏమైనా ఉందా అనిపిస్తుంటుంది. టైటిల్‌ని ప‌క్క‌న పెడితే… తొలి స‌న్నివేశం నుంచే ఈ సినిమా లాజిక్కుల‌కు దూరంగా ప్ర‌యాణిస్తుంటుంది. కోమాలో ఉన్న పేషెంట్ లేవ‌డం, జ‌య‌సుధ‌ని బ‌తికించ‌డం మ‌ళ్లీ కోమాలోకి వెళ్లిపోవ‌డం – ఏమిటో విడ్డూరం అనిపిస్తుంది. సీఈఓ ప‌రిచ‌య స‌న్నివేశం కూడా అంతే. హెలీకాఫ్ట‌ర్ పై నుంచే బాల‌య్య త‌న విన్యాసాల ప‌రంప‌ర‌కు శ్రీ‌కారం చుట్టేస్తాడు. ఆ గెట‌ప్‌లో స్టైలీష్‌గా క‌నిపించినా – బాగా ఒళ్లు చేసేశాడు బాల‌య్య‌. కొన్ని వింతైన స్టెప్పుల‌తో అభిమానుల్ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. బ్యాంకాక్ కామెడీ మాత్రం రోత పుట్టిస్తుంది. ధ‌న్‌రాజ్‌, ర‌ఘుబాబు, అదుర్స్ ర‌ఘు, శ్రీ‌నివాస‌రెడ్డి.. ఇలా గ్యాంగ్ అయితే ఉంది గానీ, వాళ్ల నుంచి కామెడీ మాత్రం పుట్టించ‌లేక‌పోయాడు. ఆ స‌న్నివేశాల‌న్నీ సినిమాకి లాగ్ చేయ‌డానికి త‌ప్ప ఇంకెందుకూ ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ద్వితీయార్థంలోనూ ఇంతే. స‌ప్త‌గిరిని తీసుకొచ్చి నానా యాగీ చేశారు. పేడ కుప్ప మీద ప‌డిపోవ‌డం, గోమూత్రం మొహంపై చ‌ల్లుకోవ‌డం – ఇదంతా కామెడీ అనుకోమంటే ఎలా.? అది చాల‌ద‌న్న‌ట్టు డ‌బుల్ మీనింగ్ డైలాగులొక‌టి.
నీ మాట‌ల‌కు అంతా త‌డిచిపోయింది..
చాలా త‌డిచింది.. ఎలా ఆర‌బెట్టుకోవాలో – అంటూ బాల‌య్య నోట ప‌లికించ‌డం ఏం బాగోలేదు.

క‌థ‌లో చాలా వెర్ష‌న్లు ఉంటాయి. సీఈఓ ఎపిసోడ్ ఒక‌టి. రైతుల స‌మ‌స్య మ‌రొక‌టి. ప‌రువు హ‌త్య‌ల నేపథ్యం…. ఇలా అనేక అంశాలు ఈ క‌థ‌లో జోడించేశారు. ఏదీ స‌రిగా రిజిస్ట‌ర్ అవ్వ‌దు. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ల గొప్ప‌ద‌నం చెబుతూ బాల‌య్య స్పీచు దంచి కొట్టాడు. రైతుల గురించి ఉప‌న్యాసాలు ఇచ్చాడు. ఫేస్ బుక్ కొటేష‌న్లు ప‌ట్టుకుని భారీ డైలాగులు ప‌లికాడు. వాటి మధ్య డాన్సులు, ఆట పాట‌లు, ముత‌క రొమాన్స్‌.. వీటితో క‌థ‌ని లాగించేశారు. సంక్రాంతి పాట అస‌లు ఈ క‌థ‌కు సింకే అవ్వ‌లేదు. బ‌హుశా అల‌వాటు ప్ర‌కారం ఈ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేద్దాం అనుకుని ఉంటారు. అందుకే అలాంటి పాట డిజైన్ చేశారు. లెక్క‌కు మించిన పాత్ర‌ధారులు, పాత్ర‌లు, స‌న్నివేశాలు, రౌడీలు ఉన్నా – వాటి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన క‌థ లేక‌పోవ‌డంతో రూల‌ర్ కాస్త రోడ్డు రోల‌ర్‌గా త‌యారైంది.

న‌టీన‌టులు

బాల‌య్య ఈ సినిమాని ఒంటి చేత్తో న‌డిపిద్దామ‌ని చూశాడు. రెండు పాత్ర‌లు.. రెండు గెట‌ప్పులు అన‌గానే బాల‌య్య ఊరిపోయి ఓకే చెప్పి ఉంటాడు. అయితే ఆ పాత్ర‌ల్ని ఎలివేట్ చేసే స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లు ఈ సినిమాలో లేకుండా పోయాయి. స్టెప్పులు మాత్రం వెరైటీగా ఉన్నాయి. బాల‌య్య గెట‌ప్పులు, విగ్గులూ.. కాస్త వింత‌గా అనిపిస్తాయి. వేదిక‌, సోనాల్‌ల‌వి కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లే. కాక‌పోతే వాళ్లే గ్లామ‌ర్‌గా లేరు. జ‌య‌సుధ‌, ప్ర‌కాష్‌రాజ్‌, భూమిక‌… వీళ్లంతా ఉన్నా నామ మాత్ర‌మే. భూమిక‌కు ప‌ట్టుమ‌ని ప‌ది డైలాగులు కూడా లేవు. కామెడీ గ్యాంగ్ ఉన్నా, లేకున్నా ఒక్క‌టే అన్న‌ట్టు త‌యారైంది.

సాంకేతిక వ‌ర్గం

స్పీడు స్పీడుగా ఈ సినిమాని లాగించేయాల‌ని చూసింది చిత్ర‌బృందం. అందుకే క్వాటిలీ విష‌యంలో రాజీ ప‌డిపోయింది. సీజీలు, డిఐలూ స‌రిగా జ‌ర‌గ‌లేదు. చిరంత‌న్ భ‌ట్ రొడ్డ‌కొట్టుడు ట్యూన్స్‌కి త‌గ్గ‌ట్టుగానే సాహిత్యం కుదిరింది. పోరాట ఘ‌ట్టాలు, అందులో ర‌క్త‌పాతం మ‌రీ ఎక్కువైపోయాయి. క‌థ ఎంత రొటీన్‌గాఉందో, దాన్ని తీసిన విధానం అంత‌కంటే రొటీన్‌గా త‌యారైంది. ఈ ద‌ర్శ‌కుడి నుంచా న‌ర‌సింహా లాంటి సినిమాలొచ్చాయా? అని ఆశ్చ‌ర్య‌పోయే రీతిలో టేకింగ్ సాగింది. మాట‌ల్లో నా కొడ‌కా, పుడింగి… లాంటి ఆణిముత్యాలు క‌నిపిస్తాయి.

మొత్తానికి ఇదో రొడ్డ‌కొట్టుడు ఊర మాస్ సినిమా. అరివీర భ‌యంక‌ర‌మైన బాల‌య్య అభిమానుల‌కు మాత్ర‌మే న‌చ్చే అంశాలున్నాయి. మిగిలిన‌వాళ్లు.. సైన్స్‌సూత్రాల్ని, లాజిక్కుల్నీ ప‌క్క‌న పెట్టి యాక్ష‌న్ ఎమోష‌న్‌లోనూ కామెడీ వెదుక్కోవాల‌నుకుంటే.. నిర‌భ్యంత‌రంగా చూడొచ్చు.

ఫినిషింగ్ ట‌చ్‌: రొడ్డ‌కొట్టుడు

తెలుగు360 రేటింగ్ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజ్యాంగంలో వైసీపీ రాళ్ల దాడులూ నిరసనే !

ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజ్యాంగాన్ని పోలీసులు అద్భుతంగా అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ పై జరిగిన దాడిన నిరసనగా చెప్పుకొస్తున్నారు పోలీసులు. అంత స్పష్టంగా దాడులకు...

ఆర్కే పలుకు : తెలుగు నేతలు ఇంత బలహీనులెందుకయ్యారు ?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలుగు ప్రజలు లోతుగా ఆలోచించాల్సిన అంశాలను వారి ముందు పెట్టారు. నేరుగా ఆయన ఏమీ చెప్పలేదు దేశంలో ఇంత జరుగుతూంటే... ...

బన్నీ-మురగదాస్… ఆశలు సజీవం

పుష్ప విడుదలైన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే కొత్త సినిమాల లిస్టు లో దర్శకుడు మురగదాస్ పేరు కూడా వినిపించింది. ఆయన చెప్పి లైన్ బన్నీకి నచ్చిందని, దాన్ని డెవలప్ చేయమని చెప్పారని...

వైసీపీ వాళ్లను ఫూల్స్ చేసేసిన ఆర్జీవీ !

వైసీపీ కోసం ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్న ఆర్జీవీ వాళ్లను ఫూల్స్ చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. వైసీపీలోని అత్యున్నత వర్గాలు చెప్పిన దాని ప్రకారం జూన్ మొదటి వారంలో అసెంబ్లీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close