నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పాడై. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీల మార్పిడి అత్యవసరం అని డాక్టర్లు తేల్చేశారు. ఆయన ప్రస్తుతం డయాలిసిస్ చేయించుకొంటున్నారు. వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, ప్రభాస్ రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించారని, ఆసుపత్రి ఖర్చులు ఆయనే భరిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. దాంతో ఫిష్ వెంకట్ సమస్యలన్నీ తీరిపోయాయని అనుకొన్నారంతా. అయితే ఆ వార్తలు అవాస్తమవని వెంకట్ కుటుంబ సభ్యులు తేల్చేశారు. ప్రభాస్ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని, ఈ విషయం ప్రభాస్ కు తెలిస్తే, ఆయన స్పందిస్తారన్న నమ్మకం తమకు ఉందని ఫిష్ వెంకట్ భార్య ఆశాభావం వ్యక్తం చేశారు.
కిడ్నీలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారని, అయితే రూ.30 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని, అన్ని డబ్బులు తమ దగ్గర లేవని, దాతలు, చిత్రసీమ ఆదుకోవాలని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుకొంటున్నారు. వెంకట్ ఆరోగ్యం చాలా కాలంగా నిలకడగా లేదు. మరోవైపు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, రోజువారీ ఖర్చులకు కూడా నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ లాంటి వాళ్లు ముందుకొచ్చి ఆదుకొంటే తప్ప… ఈ నటుడి పరిస్థితి మెరుగవ్వదు.