ఐదు రోజులపాటు శబరిమల ఆలయం తలుపులు తెరుచుకున్నాయి, మూసుకున్నాయి. ఈనెల 17 నుంచి 22 వరకూ.. ఈ మధ్య కాలంలో మహిళలకు అయ్యప్ప స్వామి దర్శనం ఉంటుందా అని అందరూ ఎదురు చూశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుందని దేశమంతా ఎదురు చూసింది. కానీ, ఈ ఐదు రోజుల్లో అది సాధ్యం కాలేదు. మొత్తంగా పది మంది మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నం చేశారుగానీ, ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే పరిస్థితే కనిపించింది. ఈ వ్యవహారం శాంతి భద్రతల సమస్యగా మారిపోయింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం, మహిళలు వెళ్లడానికి వీల్లేదంటూ కొన్ని సంఘాలు ఆలయ పెద్దలతో సహా నిరసనలు వ్యక్తం చేయడంతోనే ఈ ఐదు రోజులూ ఉత్కంఠ వాతావరణంలోనే గడిచిపోయాయి. ఇప్పుడు ఆలయ ద్వారాలు మూసుకున్నాయి. అయితే, ఈ ఐదు రోజులకే పరిస్థితి ఇలా ఉంటే… నవంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకూ ఆలయ ద్వారాలు తెరుస్తారు. దాదాపు నలభై రోజులపాటు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
కోర్టు ఆదేశాలపై ఇప్పటికే 19 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని కూడా దాఖలయ్యే అవకాశాలున్నాయి. వీటిపై విచారణ ఎప్పుడు ఉంటుందనేది మంగళవారం నాడు తేల్చి చెబుతామని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్లపై తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నిజానికి, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే రివ్యూ పిటీషన్ వేసి ఉంటే బాగుండేది. ఆ మేరకు ఆలయ బోర్డు కొంత ఆలస్యం చేసిందనే చెప్పాలి. ఇంకోటి ఈ మొత్తం వ్యవహారంలోకి రాజకీయ పార్టీలు కూడా వచ్చేయడం, భాజపా శ్రేణులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించడంతో మరింత జఠిలంగా మారిపోయి, పెద్ద సమస్యగా ప్రొజెక్ట్ అయిపోయింది.
రాబోయేది కార్తీక మాసం. అయ్యప్ప మాలలు పెద్ద సంఖ్యలో భక్తులు వేయడం ప్రారంభమౌతుంది. శబరిమలకు భక్తుల తాకిడి అనూహ్యంగా ఉంటుంది. దీంతో తాజా నిర్ణయాన్ని ఆర్డినెన్స్ ద్వారా నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎలాగూ భాజపా కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది కాబట్టి… కేంద్రం నుంచి కొంత సానుకూలమైన నిర్ణయమే ఉండే అవకాశం ఉందనీ అంటున్నారు. మొత్తానికి, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఉంది అనే చర్చ తీవ్రంగానే జరుగుతోంది.