సచిన్ టెండూల్కర్ తరవాత రికార్డుల రారాజుగా కీర్తి తెచ్చకొన్నాడు విరాట్ కోహ్లీ. ఈతరం క్రికెట్ అభిమానులు విరాట్ ని ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా చూస్తారు. ఆతరం ఫ్యాన్స్ విరాట్ లో ఓ సచిన్‌ని చూసుకొంటారు. సచిన్ స్థాపించిన రికార్డులు ఎన్నో. వాటిలో కొన్ని ఎప్పటికీ చెక్కు చెదరవన్నది సచిన్ అభిమానుల గట్టి నమ్మకం. అయితే సచిన్ చేసిన ‘సెంచరీ సెంచరీల’ రికార్డ్ విరాట్ కోహ్లీ వల్ల ప్రమాదంలో పడింది. వన్డే, టెస్ట్ ఈ రెండు ఫార్మెట్లలోనూ 100 సెంచరీలు చేసిన ఘనత టెండూల్కర్‌ది. ఆ రికార్డు ఛేదించగల మొనగాడు కోహ్లీ మాత్రమే అన్నది నవతరం నమ్మకం. అయితే ఇప్పుడు కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతానికి కోహ్లీ సెంచరీలు 81 (టెస్టులు 30, వన్డేలు 51) మాత్రమే. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే మరో 20 సెంచరీలు చేయాలి. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ చూస్తే వంద సెంచరీల మార్క్ అనేది చాలా దూరంలో ఉన్నట్టే లెక్క. కోహ్లీ ప్రస్తుతానికి వన్డేలే ఆడతాడు. టీ 20లకు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ. ఈ జమానా టీ20లది మాత్రమే. అన్ని జట్లూ వన్డేలు అడపా దడపా మాత్రమే ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం.
కోహ్లీ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. వచ్చే వరల్డ్ కప్ వరకూ వన్డేలకు అందుబాటులో ఉండాలన్నది కోహ్లీ ఆలోచన. తను ప్రస్తుతానికి ఫిట్ గానే ఉన్నాడు. వచ్చే ప్రపంచకప్ వరకూ ఫిట్ నెస్ ని కాపాడుకోవాలంటే పరిమిత మ్యాచ్‌లే ఆడాలి. కీలకమైన వన్డేలకే కోహ్లీ అందుబాటులో ఉంటాడు. ఈ వ్యవధిలో 21 సెంచరీలు కొట్టడం దాదాపు అసాధ్యం. కోహ్లీ భీకరమైన ఫామ్ ని అందుకొంటే తప్ప.. సెంచరీల మార్క్ దాటలేడు. ఇటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ కోహ్లీ గొప్ప క్రికెట్ ఆడాడు. తను ఫామ్ కోల్పోవడం చాలా అరుదు. క్లిష్టమైన మ్యాచ్‌లను కూడా కోహ్లీ గెలిపించాడు. సునాయాసంగా పరుగులు పిండుకొన్నాడు. ఒక్కసారి కుదురుకొంటే సెంచరీ కొట్టకుండా వదలడు. ఛేజింగ్ మాస్టర్. అలాంటిది ఈ రికార్డ్ కోహ్లీకే సాధ్యం కాలేదంటే.. మరే ఇతర క్రికెటర్ 100 సెంచరీల రికార్డుకు దరి దాపుల్లో కూడా వెళ్లలేడు.