ఇండస్ట్రీలో ఎమోషన్స్ కంటే రిజల్ట్స్ కీలకం. స్నేహాలూ, బంధాలూ ఉన్నా – హిట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎమోషన్ కంటే కలక్షన్లకే పెద్ద పీట. కాకపోతే కొంతమంది ఎమోషనల్ గా లాక్ అయిపోతుంటారు. వాళ్లకు రిజల్ట్ తో పని లేదు. స్నేహం, బంధం శాశ్వతం.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఇలానే ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తోంది. దేవాకట్టాతో తనకు మంచి అనుబంధం ఉంది. దేవాకట్టాని ఓ సోదరుడిలా చూస్తాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘రిపబ్లిక్’ అనే సినిమా వచ్చింది. అది ఫ్లాప్. అయితే తేజ్ – దేవాకట్టా మధ్య మాత్రం ఈ సినిమా నుంచి బంధం బలపడింది. క్లిష్టమైన పరిస్థితుల్లో తేజ్ కు మానసిక ధైర్యం అందించాడు దేవాకట్టా. దాంతో హిట్టూ, ఫ్లాపుల్ని పక్కన పెట్టి దేవా కట్టాతో మరోసారి పని చేయాలని ఫిక్సయ్యాడు తేజ్.
రిపబ్లిక్ చిత్రానికి సీక్వెల్ చేయాలని దేవాకట్టా నిర్ణయానికి వచ్చాడని, తేజ్ ఈ సీక్వెల్ లో నటించబోతున్నాడని టాక్. రిపబ్లిక్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఆ కథకు సీక్వెల్ అనేదే పెద్ద రిస్క్. నిజంగా దేవాకట్టాతో ఓ సినిమా చేయాలనుకొంటే, కొత్త కథ ఎంచుకోవడం ఓ పద్ధతి. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఒకవేళ చేస్తానన్నా.. నిర్మాతలు సిద్ధంగా ఉంటారా? నిర్మాత దొరికినా ఓటీటీ లో అమ్ముకోగలరా, బయ్యర్లు నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు. దేవాకట్టా సామర్థ్యంపై ఎవరికీ అప నమ్మకాలు లేవు. తను సత్తా ఉన్న దర్శకుడే. కాకపోతే ఓ కొత్త కథతో ఈ కాంబో ముందుకు వెళ్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.