ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైఎస్సార్సీపీ పరిస్థితి చూస్తుంటే పళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంది? అన్నట్లుగా తయారైంది. ఏ అంశం దొరికినా దానితో ప్రభుత్వంపై బురద జల్లాలని చూడటం, ఆ రాయి కాస్తా రివర్స్ కొట్టి తమ నెత్తినే పడటంతో తాడేపల్లి ప్యాలెస్ లబోదిబోమంటోంది. ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన కుటుంబ ఫ్యాక్షన్ చరిత్రను స్వయంగా బయట పెట్టుకున్న చందంగా.. ఇప్పుడు మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేసి, తాము విసిరిన రాయితో తామే పళ్లు రాలగొట్టుకున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిపోయిందంటూ వైసీపీ ఆడిన డ్రామాలు, చేసిన కుట్రలన్నీ ఇప్పుడు నవ్వులపాలయ్యాయి.
పక్కాగా ఫేక్ను బట్టబయలు చేసిన ప్రభుత్వం
సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అధికార పక్షాలు రాజకీయంగా ఎదురుదాడికి దిగుతాయి. కానీ, కూటమి ప్రభుత్వం ఇక్కడ చాలా ఓపికగా, క్లాస్‌గా వ్యవహరించింది. విద్యాశాఖ ద్వారా ప్రతి ఆరోపణకూ సాంకేతిక ఆధారాలు, హాల్ టికెట్ నంబర్లు, మెరిట్ ర్యాంకులతో సహా లెక్కలు బయటపెట్టి వైసీపీ ఫేక్ ప్రచారానికి పక్కాగా చెక్ పెట్టింది. జగన్ రెడ్డిని కలిసి అన్యాయం జరిగిందని ఏడ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కేవలం వారి కేటగిరీల పరిధిలోని కటాఫ్ మార్కులేనని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే భర్తీ జరిగిందని ఆధారాలతో నిరూపించడంతో వైసీపీ గుట్టు రట్టయింది.
ఇదంతా సజ్జల తెచ్చిన రాయే !
అయితే అంతా తెలిసి కూడా, ఇలాంటి ‘సెల్ఫ్ గోల్’ ఫేక్ పాలిటిక్స్ ఆడించి పార్టీ పరువును బజార్న పడేసింది ఎవరబ్బా? అని ఆరా తీస్తే.. అందరి చూపులు తాడేపల్లి అంతర్గత చక్రవర్తి సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వెళ్తున్నాయి. వైఎస్సార్సీపీలో ఇలాంటి ‘పళ్లు రాలగొట్టే’ తుస్సు ఐడియాలు ఇవ్వడంలో ఆయన రూటే సెపరేటు. పాలనలో ఐదేళ్లుగా ఇలాంటి అద్భుతమైన స్ట్రాటజీలతోనే పార్టీని ఘోర పరాజయం వైపు నడిపించిన సజ్జల .. ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా తన మార్కు ‘రివర్స్ అటాక్’ ఐడియాలను అస్సలు వదులుకోవడం లేదు. అభ్యర్థుల మెరిట్ లిస్టులు, ప్రభుత్వ వెబ్సైట్లలో ఉండే డేటాను కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా జగన్ చేత ప్రెస్ మీట్లు పెట్టించి మరీ అభాసుపాలు చేశారు.
లోకేష్ స్పందించలేదట!
ఇక ఈ దెబ్బతో డిఫెన్స్‌లో పడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మరింత విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్వయంగా స్పందించలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇక్కడే సజ్జల గారు అసలు లాజిక్ మిస్ అయ్యారు. మంత్రి లోకేష్ స్వయంగా పొలిటికల్ డైలాగులతో స్పందించకపోబట్టే.. విద్యాశాఖ ఇంత అధికారికంగా, క్లాస్‌గా, డేటాతో సహా వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నలిపేయగలిగింది. ఒకవేళ లోకేష్ గనక పొలిటికల్ కౌంటర్ ఇచ్చి ఉంటే, దాన్ని కూడా రాజకీయ వివాదంగా మార్చి సజ్జల గారు ఇంకొన్ని రోజులు కాలక్షేపం చేసేవారేమో!


