వెయ్యి ఎలుకలను చంపిన పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది వైసీపీ నేత సజ్జల తీరు. అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారనే విమర్శలున్న ఆయన..అధికారం కోల్పోయాక ప్రజాస్వామ్య ప్రేమికుడిగా డైలాగ్ లు కొడుతున్నారు.టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణలో భాగంగా గుంటూర్ సీఐడీ ఆఫీసుకు వచ్చిన సజ్జల అనంతరం మీడియాతో మాట్లాడారు.
అప్రజాస్వామికంగా వైసీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని , టార్గెట్ గా చేసి మరీ అరెస్టులు చేస్తున్నారని సజ్జల తెగ బాధపడిపోయారు. గత ఐదేళ్లలో సజ్జల డైరెక్షన్ లో రాజ్యాంగవిరుద్దంగా టీడీపీని ఎలా టార్గెట్ చేశారో ఆయనకూ తెలుసు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారో తెలుగు సమాజం అంతా చూసింది. అదే వైసీపీ దుష్టరాజకీయాలకు చరమగీతం పాడేలా చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆర్ఆర్ఆర్ ను కస్టడీలో ఎలా వేధించారో సజ్జల మరిచిపోయినట్టు ఉన్నారు. రఘురామ ఎంపీ అన్న సంగతిని కూడా పక్కనపెట్టి మరీ టార్చర్ చేశారు.
చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుండటంతో సజ్జల రాజ్యాంగం, విలువలు, మానవీయత అంటూ మాట్లాడారు. తన దాకా వచ్చాక కానీ రాజ్యాంగం , హక్కులు ఉంటాయనే విషయం సజ్జలకు అర్థమైనట్టు ఉంది. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ పలవరించారు. అదే సమయంలో వాస్తవంలోకి రండి.. లేదంటే జనాలు తరిమికొడుతారని చెప్పుకొచ్చారు. నిజానికి, వైసీపీ హయాంలో వాస్తవంలోనే ఉండి ఉంటే.. ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు..జగన్ రెడ్డిని సజ్జల ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్లి వైసీపీని పాతాళంలోకి తోక్కేలా చేశారు.
వైసీపీ ప్రస్తుత దుస్థితికి సజ్జల నిర్ణయాలే ఎక్కువ కారణం..ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెప్పారు.గత ఐదేళ్లు ఫిక్షన్ లో గడిపిన సజ్జల ఇప్పుడు టీడీపీని వాస్తవంలోకి రావాలని కోరడం గమనార్హం.