వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాభవం క్రమంగా తగ్గుతోందనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల మాటకు గతంలో ఉన్నంత విలువ ఇప్పుడు లేదని, కీలక నిర్ణయాల్లో ఆయన ప్రమేయం తగ్గుతోందని పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. జగన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు సజ్జల ప్రాధాన్యతను తగ్గించేలా ఉన్నాయనే సంకేతాలు క్యాడర్‌లోకి బలంగా వెళ్తున్నాయి.
సజ్జల బాధ్యతలు పరిమితం చేస్తున్న వైనం
ఒకప్పుడు పార్టీలోని అన్ని విభాగాలను, జిల్లాల ఇంచార్జులను సమన్వయం చేసిన సజ్జల బాధ్యతలను ఇప్పుడు జగన్ కుదించినట్లు తెలుస్తోంది. ఇకపై పార్టీ పూర్తి స్థాయి వ్యవహారాలు కాకుండా, కేవలం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావాలని జగన్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కీలకమైన ఇంచార్జుల నియామకం, రాజకీయ వ్యూహాల నుండి ఆయనను తప్పించి, పరిమిత బాధ్యతలే అప్పగించడం వెనుక ఓటమి తర్వాతి సమీకరణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సజ్జల ప్లేస్ ను భర్తీ చేస్తున్న చెవిరెడ్డి
సజ్జల ఖాళీ చేస్తున్న ఆ స్థానంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతల హవా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన అనేక ఆదేశాలు సజ్జల కార్యాలయం నుండి కాకుండా, చెవిరెడ్డి లేదా జగన్ నేరుగా నియమించిన ఇతర నేతల నుండి వస్తుండటం గమనార్హం. తాడేపల్లి కార్యాలయంలో సజ్జల ఇచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయి నేతలు కూడా మునుపటిలా సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇది ఆయన పట్టు కోల్పోవడానికి నిదర్శనమని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
వైసీపీ క్యాడర్లో ఇంకా సందేహమే
ఈ మార్పులు వైసీపీ క్యాడర్లో భిన్నమైన సంకేతాలను పంపుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని ప్రక్షాళన చేయడంలో భాగంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా లేక సజ్జలపై ఉన్న వ్యతిరేకతను గమనించి ఆయనను పక్కన పెడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా, వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 గా చక్రం తిప్పిన సజ్జల ప్రభావం మసకబారడం, కొత్త నేతల ప్రాధాన్యత పెరగడం పార్టీలో ఒక కొత్త శకానికి నాందిగా కనిపిస్తోంది. కానీ సజ్జల ఇలాంటి సమయాల్లోనే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని.. అడ్డంగా ఉన్న నేతల్ని శంకరగిరి మాన్యాలకు పంపించి అడ్డం లేకుండా చేసుకుంటారని చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.


