కేంద్ర పింఛ‌న్ కూడా కాపీ ప‌థ‌క‌మే అంటున్న సాక్షి..!

ఎన్నిక‌ల బ‌డ్జెట్ ను మోడీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టింది. దీన్లో మ‌ధ్య త‌ర‌గ‌తి ఓట‌ర్ల‌ను ల‌క్ష్యం చేసుకుని కొన్ని స్కీములు, నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇక‌, అసంఘ‌టిత కార్మికుల‌కు బీమా అంటూ కేంద్రం ఒక స్కీమ్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వోద్యోగుల మాదిరిగానే అసంఘ‌టిత రంగంలోని కార్మికులంద‌రికీ అర‌వ‌య్యేళ్లు దాటాక పెన్ష‌న్ ఇచ్చే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియంను కూడా కార్మికుల నుంచే వ‌సూలు చేస్తారు. అవ‌ర‌య్యేళ్లు దాటాక నెల‌కి రూ. 2000 చొప్పున పెన్ష‌న్ ఇస్తామంటూ మోడీ స‌ర్కారు చెప్పింది. అయితే, ఎలాంటి ప్రీమియం చెల్లింపులు లేకుండానే వృద్ధుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలే రూ. 2000 పెన్ష‌న్ ఇస్తున్న ప‌రిస్థితి ఉంది. ప్రస్తుతం ఆంధ్రాలో అదే అమలు అవుతోంది. కాబ‌ట్టి, ఇదేమీ కొత్త నిర్ణ‌యం కానే కాదు. అసంఘ‌టిత కార్మికుల జీవితాల్లో మార్పులు తెచ్చేది అంత‌క‌న్నా కాదు.

అయితే, ఈ నిర్ణ‌యాన్ని వైకాపా ప‌త్రిక సాక్షి ఎలా ప్ర‌జ‌ల‌కు చూపించాల‌నుకుందంటే… ఒక‌టీ, ఇది గ‌తంలోనే వైయ‌స్సార్ చేప‌ట్టిన ప‌థ‌కం అని చెప్ప‌డం, రెండోది… గ‌తంలో వైయ‌స్సార్ డ్వాక్రా మ‌హిళ‌ల గురించి ఆలోచించార‌ని చెప్ప‌డం! 2008లో వైయ‌స్సార్ తీసుకున్న నిర్ణ‌యాన్నే కేంద్రం కాపీ కొట్టేసిందంటూ ఒక క‌థ‌నం రాశారు. అర‌వ‌య్యేళ్లు దాటిన డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్ అందించాల‌న్న ఉద్దేశంతో ఏడాది రూ. 365 జ‌మ‌ చేస్తే, ప్ర‌భుత్వం కూడా అంతే మొత్తం జ‌మ చేసి… 60 ఏళ్లు దాటాక పెన్ష‌న్లు ఇవ్వాల‌ని వైయ‌స్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారని రాశారు. మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కంతోపాటు ఇంకా ఏమేం ల‌బ్ధి చేకూర్చేలా నాటి వైయ‌స్ పాల‌న సాగింద‌నేది కూడా ఈ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఇంకో విచిత్ర‌మైన విష‌యం ఏంటంటే… ఏడాదికి రూ. 100 జ‌మ చేస్తూ, కేంద్రం కూడా అంతే మొత్తం జ‌మ‌చేసేలా ప్ర‌స్తుతం కేంద్రం బ‌డ్జెట్ లో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కం గురించి ఆంధ్రాలో చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌! ఇది వైయ‌స్సార్ హ‌యాంలో అమ‌లైన ప‌థ‌కం మాదిరిగానే ఉందే అనీ, ఎంతో ముందో చూపుతో నాడు వైయ‌స్సార్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాన్ని నేడు దేశ‌మంతా అనుస‌రిస్తోంద‌ని అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని రాశారు.

విచిత్రం ఏంటంటే… సంక్షేమ ప‌థ‌కాలు కాపీ కొట్ట‌డం అంటూ వైకాపా మాట్లాడుతూ ఉండ‌టం! స‌మ‌స్య‌ల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు అండ‌దండ‌గా ఉండాలనే ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వాలైనా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడ‌తాయి. అంత‌మాత్రాన స‌ద‌రు ప‌థ‌కాల‌పై ఆనాటి అధికార పార్టీల‌కు, లేదా అధికారంలో ఉన్న‌వారికీ పేటెంట్లు ఉండ‌వు! అదేమీ వాళ్ల క్రియేటివిటీ కాదు. ఈ మ‌ధ్య ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారు పెన్ష‌న్లు డ‌బుల్ చేస్తే అది త‌మ న‌వ‌ర‌త్నాల్లోని అంశ‌మే అంటారు! కులాల వారీగా కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తే… అదీ జ‌గ‌న్ ఇచ్చిన హామీ అనే అంటారు. ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌ను ఓటు బ్యాంకులుగా మాత్ర‌మే వైకాపా చూస్తూనే ఉంద‌నేది ప‌దేప‌దే రుజువౌతూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com