ఆంధ్రలో సాక్షికి పెరిగిన పాఠకులు..!

గత ఏడెనిమిదేళ్లుగా… పాఠకుల్ని కోల్పోవడమే కానీ.. పెంచుకోలేకపోయిన సాక్షి దినపత్రిక.. తొలి సారి.. పాఠకుల్లో.. పెరుగుదల నమోదు చేసుకుంది. అయితే..ఈ పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. తెలంగాణలో మాత్రం.. సాక్షి దినపత్రిక పాఠకులు మరింత తగ్గిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంతో.. సహజంగానే సాక్షి పత్రికకు కాస్త గిరాకీ పెరిగింది. ఆ ప్రభావం రిడర్ షిప్‌లోనూ కనిపిస్తోంది. ఇండియన్ రీడర్ షిప్ సర్వే .. రెండో త్రైమాసిక ఫలితాల్లో.. సాక్షి పత్రిక ఒక్కటే.. పాఠకులను పెంచుకుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి కోల్పోయాయి. ఒక్కతెలుగులోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా.. దినపత్రికలు పాఠకుల్ని వేగంగా కోల్పోతున్నాయి.

ఏపీలో సాక్షికి పెరిగిన పాఠకులు.. ఈనాడు, జ్యోతికి మైనస్..!

2019కి సంబంధించి రెండో త్రైమాసిక ఇండియన్ రీడర్ షిప్ సర్వేలో.. ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొత్తం పాఠకుల సంఖ్యలో ఈనాడు.. ఎప్పట్లగానే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. పాఠకుల సంఖ్యను మాత్రం కోల్పోయంది. ఆంధ్రప్రదేస్‌లో ఈనాడు పాఠకుల సంఖ్య 72 లక్షల 43వేలకు పరిమితమయింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. ఇది దాదాపుగా ఏడు లక్షలు తక్కువ. అదే ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య.. ఆంధ్రప్రదేశ్‌లో 36 లక్షల 28వేల దగ్గర తేలింది. జ్యోతి పాఠకుల సంఖ్య కూడా లక్షన్నర వరకూ తగ్గింది. అదే సాక్షి దినపత్రికు మాత్రం పాఠకుల సంఖ్యను 53 లక్షల 70వేలకు చేర్చుకుంది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. లక్షా ఇరవై వేల మంది రీడర్లకు ఎక్కువ.

తెలంగాణలో అన్ని పత్రికలకూ మైనస్సే..!

తెలంగాణలో.. ఈనాడు పాఠకులను ఆకట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉంది. అయినప్పటికీ.. కొత్తగా పాఠకుల్ని చేర్చుకోలేకపోయింది. తెలంగాణలో ఈనాడు పాఠకుల సంఖ్య 67 లక్షల మూడువేలుగా ఇండియన్ రీడర్ షిప్ సర్వే నిర్ధారించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. 30వేల వరకూ రీడర్లు తగ్గిపోయారు. రెండో ప్లేస్‌లో ఉన్న సాక్షి పత్రిక ఈనాడులో సగం కూడా.. పాఠకుల్ని కాపాడుకోలేకపోయింది. తెలంగాణలో సాక్షి రీడర్లు 32 లక్షల 28వేలు మాత్రమే. మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. 20వేల మందిరీడర్లను సాక్షి కోల్పోయింది. అలాగే నమస్తే తెలంగాణ పదివేలు, ఆంధ్రజ్యోతి మరో పదివేల చొప్పన రీడర్లను కోల్పోయింది. నమస్తే తెలంగాణకు 28 లక్షలు.. ఆంధ్రజ్యోతికి 22 లక్షల మంది రీడర్లు ఉన్నారని ఐఆర్ఎస్ సర్వే నిర్ధారించింది.

ఆన్ లైన్ న్యూస్‌కి అలవాటు పడుతున్న జనం..!

అయితే.. ప్రధాన పత్రికల పాఠకుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. వారి ఆన్ లైన్ ఎడిషన్లకు.. ఆదరణ.. అంతకు రెట్టింపు అవుతోందని సర్వే అంచనా వేసింది. కొత్త తరం.. పాత తరం కూడా… న్యూస్ కోసం.. ఎక్కువగా ఇప్పుడు ఆన్ లైన్ … సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారని అంచనా వేశారు. పేపర్లు కొని చదివే అలవాటు క్రమంగా తగ్గిపోతోందని.. అందుకే.. రీడర్ షిప్ కూడా.. తగ్గుతోందని అంటున్నారు. టెక్నికల్‌గా… ఇప్పుడు.. ఇంటర్నెట్ లేని పరిస్థితిని ఊహించలేం కాబట్టి.. ఇక ముందు కూడా.. వార్తా పత్రికలకు గడ్డు పరిస్థితే కొనసాగవచ్చని ఐఆర్ఎస్ అంచనా వేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com