రియో ఒలింపిక్స్ లో భారత్ కి తొలి పతకం సాధించి పెట్టింది సాక్షి మాలిక్. మహిళల 58 కేజీల విభాగంలో ఆమె కాంస్య పథకం సాధించిది. రేపిచేజ్ ఫైనల్స్ లో కిర్గిజిస్తాన్ కి చెందిన టినిబెకోవాని 8-5 తేడాతో ఓడించి సాక్షి మాలిక్ కాంస్య పథకం సాధించింది.
సాక్షి మాలిక్ అసలు రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం వస్తుందని కూడా ఊహించలేదు. భారత్ తరపున గీత ఫోగట్ పాల్గొనవలసి ఉంది. కానీ ఒలింపిక్ అర్హత పోటీలలోనే చాలా పేలవమైన ప్రదర్శించడంతో ఆమెకి దక్కవలసిన ఈ అదృష్టం సాక్షి మాలిక్ కి దక్కింది. ఊహించని విధంగా అందివచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాక్షి మాలిక్ పతకం, దానితో బాటు దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకొంది. ఆమె 2014 కామన్ వెళ్త క్రీడలలో రజత పథకం, 2015 ఆసియా రెజ్లింగ్ పోటీలలో కాంస్యం గెలిచింది. కానీ భారత్ మహిళా రెజ్లర్ అంటే గీత ఫోగట్ పేరే ఎక్కువగా వినిపించేది. ఆమె ఏ కారణం చేతయినా పోటీలో పాల్గొనలేనప్పుడు మాత్రమే సాక్షి మాలిక్ కి అవకాశం దక్కుతుండేది. ఇప్పుడు రియో ఒలింపిక్ క్రీడలలో కూడా అదేవిధంగా అవకాశం దక్కడం చాలా విచిత్రం.. చాలా అదృష్టం కూడా.
రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ మొదటి నుంచి తన సత్తా చాతుకొంటూనే ఉంది. తొలి రౌండ్లో 5-4 పాయింట్స్ తో స్వీడన్ కి చెందిన జోహాన్న మాట్సన్ ని ఓడించింది. ఆ తరువాత 12-3 తేడాతో మంగోలియాకి చెందిన పురేవ్ డోర్జిన్ ని ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో సాక్షి మాలిక్-మారియానా చేర్దిరోవ 5-5 పాయింట్స్ తో సమానంగా నిలిచారు. కానీ క్వార్టర్ ఫైనల్స్ లో రష్యా రెజ్లర్ కొబ్లోవ జలబోవ చేతిలో 2-9 తేడాతో సాక్షి మాలిక్ ఓడిపోయింది. కొబ్లోవ జలబోవ ఫైనల్స్ చేరడంతో సాక్షి మాలిక్ రేపిచేజ్ కి అర్హత సాధించి కిర్గిజిస్తాన్ కి చెందిన టినిబెకోవాని 8-5 తేడాతో ఓడించి సాక్షి మాలిక్ కాంస్య పథకం సాధించింది.
సాక్షి మాలిక్ స్వస్థలం హర్యానాలో రోహాతక్ పట్టణం. ఆమె సెప్టెంబర్3,1992లో జన్మించింది. సుదేష్ మాలిక్, సుఖ్ బీర్ మాలిక్ ఆమె తల్లి తండ్రులు. ఆమె ఈ మెడల్ గెలిచినందుకు హర్యానా ప్రభుత్వం రూ.2కోట్లు, భారతీయ రైల్వేస్ రూ.50 లక్షలు, భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ రూ.20 లక్షలు, జె.ఎస్.డబుల్యూ సంస్థ రూ.15 లక్షలు, ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రూ.1.01 లక్షలు బహుమానం ప్రకటించారు.