జగన్ రెడ్డికి అతి పెద్ద ముప్పుగా సాక్షి మీడియా మారుతోంది. ఆయనను ఓ మాయా ప్రపంచంలోనే ఉంచుతోంది. దానికి సాక్ష్యం అమరావతిపై సాక్షి చేస్తున్న తాజా ప్రచారం. అమరావతిలో ఇప్పుడు పదిహేను వేల మంది పనిచేస్తున్నారు. 50 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. జగన్ పదేళ్లు పెంచిన జంగిల్ ను క్లియరెన్స్ చేసి పనులు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులు కళ్ల ముందే ఉన్నాయి. అయినప్పటికీ నారాయణ ప్రెస్మీట్లో మాట్లాడిన ఓ చిన్న మాటను పట్టుకుని .. అక్కడ ఇంకా పిచ్చి మొక్కలే ఉన్నాయన్నట్లుగా .. పాత దృశ్యాలతో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అమరావతి అక్కడే అని కథనాలు వండుతున్నారు.
అమరావతి ఇప్పుడో ఆర్థిక సామ్రాజ్యం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఐదేళ్ల పాటు నిలిచిపోయిన నిర్మాణాలను పునరుద్ధరించడమే కాకుండా, దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో సుమారు 15,000 మంది కార్మికులు, వందలాది భారీ యంత్రాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన జంగిల్ క్లియరెన్స్ పూర్తయి, ఐకానిక్ భవనాల పునాదులు పడుతున్న వేళ.. జగన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా మాత్రం అమరావతిలో ఇంకా పిచ్చి మొక్కలే ఉన్నాయంటూ పాత దృశ్యాలతో కథనాలు ప్రసారం చే స్తున్నారు.
తప్పుడు ప్రచారమే లక్ష్యం – పనుల వేగాన్ని ప్రజల ముందు ఉంచుతున్న యూట్యూబ్ చానళ్లు
ఇటీవల మంత్రి నారాయణ ఒక ప్రెస్ మీట్లో ప్రాజెక్ట్ పనుల వేగంపై కొన్ని సాంకేతిక వివరణలు ఇచ్చారు. అయితే, ఆ మాటల్లోని సారాంశాన్ని పక్కనపెట్టి, కేవలం ఒక చిన్న అంశాన్ని పట్టుకుని అమరావతిలో అభివృద్ధి శూన్యం అన్నట్లుగా సాక్షి చిత్రీకరిస్తోంది. వాస్తవానికి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వంటివి వేగంగా సాగుతుంటే, వాటిని చూపించకుండా పదేపదే పాత వీడియోలను, గ్రాఫిక్స్ అంటూ విమర్శలు చేయడం ద్వారా తమను తాము మోసం చేసుకుంటున్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో.. ఓ పది మంది వరకూ యూట్యూబర్స్ డైలీ అప్ డేట్స్ ఇస్తున్నారు.వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నట్లే కదా.
జగన్కు ముప్పుగా మారుతున్న సొంత మీడియా?
ఏ రాజకీయ నాయకుడికైనా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియడం అత్యంత అవసరం. కానీ సాక్షి మీడియా అనుసరిస్తున్న తీరు జగన్ మోహన్ రెడ్డిని ఒక మాయా ప్రపంచం లో ఉంచుతోంది. ప్రజలు కళ్లముందు అభివృద్ధిని చూస్తుంటే, మీడియాలో మాత్రం దానికి భిన్నమైన వార్తలు రావడం వల్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా వాస్తవాలను గ్రహించలేక పోతున్నారు. ఇది చివరికి పార్టీ ఇమేజ్ను దెబ్బతీయడమే కాకుండా, ప్రజల్లో జగన్ రెడ్డిపై ఉన్న విశ్వసనీయతను మరింత తగ్గిస్తోంది. చివరికి సొంత పార్టీ నేతలు , కార్యకర్తలు కూడా సాక్షిని నమ్మలేని స్థితికి వెళ్తున్నారు. నాయకత్వానికి వాస్తవాలు చేరవేయాల్సిన మీడియా సంస్థే, వారిని భ్రమల్లో ఉంచడం వల్ల జగన్ తన రాజకీయ వ్యూహాలను సరిదిద్దుకునే అవకాశం కోల్పోతున్నారన్నది స్పష్టమవుతోంది.
