`సాక్షి’ కథనంతో జగన్ పార్టీకి ఛాన్స్ మిస్!

ఫోకస్

జగన్ నేతృత్వంలోని `సాక్షి’ పత్రిక ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సిపీకి మేలు చేయకపోగా, తన తొందరపాటు కథనంతో అధికార పార్టీని దుమ్ముదులిపే విషయంలో జగన్ పార్టీకి ఓ గొప్ప ఛాన్స్ ని మిస్ అయ్యేలా చేస్తున్నదా ? సాక్షి పత్రికలో ప్రచురితమైన తాజా కథనంతో ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. సాక్షి పత్రిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిపనినీ, ప్రతి `జీవో’ని భూతద్దంలో పెట్టి మరీ చూస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో తాను ముందే ఊహిస్తూ, ఏదో కుంభకోణం జరగబోతున్నట్లు రాసేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షానికి అవసరమైన కీలక సమాచారాన్ని `మౌత్ పీస్’ పత్రిక ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుబట్టలేరు.కానీ ఏదో జరగబోతుందని ముందస్తు హెచ్చరికలు చేయడం వల్ల ప్రధాన ప్రతిపక్షానికి మేలు చేయకపోగా ఓ మంచి ఛాన్స్ ని పార్టీకి పోగొట్టినట్లవుతున్నది. కుంభకోణం అంకుర దశలో ఉన్నప్పుడే బయటపెట్టడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదన్న సంగతిని సదరు పత్రిక విస్మరిస్తోంది. ఇంతకీ సాక్షి పత్రిక జగన్ పార్టీకి అండగా ఉందా ? లేక తన తొందరపాటు కథనాలతో పార్టీని ఇరుకున పడేస్తున్నదా? అన్న సందేహం వస్తున్నది. దీనికి తోడు కథనం నడిపించిన తీరు కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఈ తాజా కథనం ఏమిటో,దాని తీరుతెన్ను ఎలా ఉందో ఓసారి చూద్దాం..

ఇప్పుడు తాజాగా `పెంచేద్దాం.. నొక్కేద్దాం!’ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాబోయే కుంభకోణంగా చెప్పుకునే ఈ భారీ ముడుపుల వ్యవహారం కేవలం మొగ్గ దశలోనే బట్టబయలు చేయడం వల్ల జగన్ పార్టీకి వొరిగేదేమీ లేకపోయినా, అధికార తెలుగుదేశం పార్టీకి మాత్రం తప్పు సరిదిద్దుకునే అవకాశం పుష్కలంగా ఇచ్చినట్లయింది. దీంతో ఏదో పేలిపోతుందనుకుంటే చివరకు తుస్సుమన్నట్టుగా వ్యవహారం మారిపోతున్నది. ఇది కాదు జగన్ పార్టీ కోరుకునేది. కానీ పార్టీ ఆలోచనలతో సంబంధం లేకుండానే సాక్షిలో కథనాలు వచ్చేస్తున్నాయి. ఇదే విడ్డూరం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖలో కాంక్రీట్ పనులకు కొత్త రేట్లు ఖరారుచేసి తద్వారా తస్మదీయులకు భారీగా ముడుపులు అందేలా చేయాలనుకుంటున్నదన్నదే ఈ కథనం సారాంశం. ఖజానాపై మూడువేల కోట్ల అదనపు భారం పడే పరిస్థితి ఉన్నప్పటికీ, గుత్తేదారులకు అదనపు చెల్లింపులు చేసి, ఆ `అదనాన్ని’ ముడుపులుగా నొక్కేయడానికి రంగం సిద్ధం అయినట్లు `సాక్షి’ బల్లగుద్దీ మరీ చెబుతున్నది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా జలవనరుల శాఖ తన పరిధిలోని కాంక్రీట్ పనులకు `స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్’ (ఎస్ఎస్ఆర్)అమలుచేస్తూ, ప్రభుత్వానికి 3వేల కోట్లకు పైగా అదనపు భారం మోపడానికి వెనుకాడటంలేదని తేల్చి చెప్పింది. ఈ కథనానికి సపోర్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవో 22, 63లను ఉటంకించారు. అంతేకాకుండా, ఎస్ఎస్ఆర్ వర్తింపజేసే విషయాన్ని పరిశీలించడం కోసం నిపుణుల కమిటీ వేశారని కూడా ఈ కథనం పేర్కొన్నారు. ఈ నిపుణుల కమిటీ త్వరలోనే పెద్దలకు అనుకూలంగా సిఫార్సు చేస్తుందని కూడా కథనం తేల్చిపారేసింది.

ఈ జీవోల ప్రకారంగా క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కు 2,500 నుంచి నాలుగు వేలకు పెరిగిందనీ, ఇప్పుడు తాజా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ ప్రకారం ఏడువేలు చెల్లించడానికి ప్రభుత్వం సమాయుత్తమవుతున్నదని చెబుతున్నారు. జీవోల లెక్కలు సరిగానే ఉన్నా, తాజా ఎస్ఎస్ఆర్ ప్రకారం మరో మూడువేలు పెంచుతున్నారనడానికి ఈ కథనంలో ఎక్కడా సాక్షాధారం లభించదు. ఇది కేవలం జలవనరుల శాఖలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అంటే ఒక రూమర్ ని ఆసరాగా తీసుకుని సాక్షి రంధ్రాన్వేషణ చేసిందన్నమాట. మిగతా కథనం చదువుతుంటే, `సిద్ధమైంది’, `సమాయుత్తమవుతోంది’, `పెద్దల ముఠా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది’, `అధికార వర్గాలు చెబుతున్నాయి’, `పావులు కదులుతున్నాయి’, `చివరకు ఎం జరగనుంది?’ `కమిటీ దాదాపు అలాంటి నిర్ణయమే తీసుకుంటుంది’ వంటి కచ్చితత్వంలేని పదాలతో కథనం వడివడిగా సాగిపోయింది.

ఈ కథనానికి మరో సపోర్ట్ సాగునీటి శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్ చెప్పిన మాటలు. అయితే, సదరు ఇంజనీర్ పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదంటూ ఈ పత్రిక పేర్కొంది. తన 25 సంవత్సరాల సర్వీసులో ఇంత అడ్డగోలు నిర్ణయాలు చూడలేదని సదరు ఇంజనీర్ వాపోయాడట. కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ధరలు పెంచడం గతంలో ఎన్నడూ చూడలేదని ఈ ఇంజనీర్ చెప్పినట్లు కథనంలో ఉంది. ఈ కథనం మొత్తానికీ ఈ విశ్వసనీయ వర్గం సమాచారమే ఆధారంమన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

కథనం ఆసక్తికరంగా సాగినప్పటికీ, ఊహాజనిత ధోరణే ఎక్కువ పాళ్లు ఉండటం గమనార్హం. ఎప్పుడో ఏదో జరగబోయే కుంభకోణాన్ని ముందుగానే వెలికితీయడానికి పడిన తపనలా సాగిపోయింది. ఈ తొందరపాటు లేకుండా ఉంటే పత్రిక భావిస్తున్నట్లు పెద్ద కుంభకోణమే జరిగే అవకాశాలుంటాయేమో. మొగ్గదశలోనే వ్యవహారం బట్టబయలు చేయడంతో ఓ పెద్ద ఛాన్స్ ను ప్రధాన ప్రతిపక్షం (వైఎస్సార్ సిపీ) కోల్పోయినట్లే అయింది. మంచి చేయబోయి, చివరకు ఒక కీలక అస్త్రాన్ని అందించడం మరచిపోయినట్లయింది. అందుకే అంటారు, పట్టనేర్చు పాము పడగ వోరగ చేయి – అని. ఏదో ఒక వంట వండి వార్చాలన్న తపనలో దీర్ఘకాలిక ప్రయోజనాలు మరిచిపోవడం వల్లనే ఇలాంటి కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షానికి మౌత్ పీస్ గా ఉన్న ఈ పత్రిక ఇలాంటి కథనాలను ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నమాట నిజమే. కాకపోతే ముందస్తుగానే కుంభకోణాలను గుర్తించి హెచ్చరికలు చేసేటప్పుడు తగిన ఆధారాలను బలంగా చూపించాలి. ప్రభుత్వం కచ్చితంగా ప్రజలకు జావాబుదారీగా ఉండాల్సిందే. సమాచార హక్కు చట్టం క్రింద వాస్తవాలను సేకరించే వీలున్నప్పుడు తొందరపడి అరకొరగా కథనాలు రాయడం వల్ల అనుకున్న ప్రయోజనం సిద్ధించదు.

ఒక్క సాక్షి పత్రికేకాదు, ప్రభుత్వంపై నిఘా ఉంచడంలో ప్రతిఒక్కరికీ బాధ్యత ఉంది. ప్రభుత్వ పనితీరులో ఏమాత్రం అనుమానాలున్నా ఎండగట్టాల్సిందే. అయితే దీన్ని అమలుపరచాలన్న తపనతో ఊహాజనిత భయాలను ప్రజలమీద రుద్దకూడదు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close