సాక్షి మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ను తీసేస్తే.. అసలు ఆ పత్రికలో వార్తలేమీ ఉండవని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తూంటారు. ఇప్పుడు గతంలోలా వదిలేయడం లేదు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. రాజకీయ ఆరోపణల విషయంలో అలాగే స్పందించినా ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పులు చేస్తే వెంటనే .. న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. సోమవారం.. ఇంటర్ లో ప్రవేశాలు తగ్గిపోయాయని నారా లోకేష్ చూస్తున్న విద్యా శాఖ మీద నిందలేశారు.
సింగపూర్ లో ఉన్నా సరే వెంటనే ఆ కథనంలో నిజా నిజాల్ని లోకేష్ తెలుసుకున్నారు. ఒక్కంటే ఒక్క నిజం లేకపోవడంతో.. సాయంత్రానికి విద్యాశాఖ నుంచి పూర్తి స్థాయి రిజాయిండర్ విడుదల అయింది. సాక్షికి కూడా పంపించారు. ఆ కథనంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశం తప్పు అని నిర్దారించి సాక్ష్యాలు ఇచ్చారు. తప్పుడు వార్త ఎక్కడ.. ఎలా ప్రచురించారో.. అక్కడే అదంతా తప్పు అని.. తాము ఇచ్చిన నిజాలను ప్రచురించాలని అందులో స్పష్టం చేశారు.
అయితే సాక్షి మాత్రం మంగళవారం ఆ వివరణను ప్రచురించలేదు. రిజాయిండర్ ఇచ్చినా ప్రచురించకపోడం.. కనీసం తప్పు రాసినట్లుగా అంగీకరించకపోవడంతో విద్యాశాఖ తదుపరి చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయపరమైన చర్యలతో పాటు ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నారు. బురద చల్లామే పనిగా పెట్టుకున్న సాక్షి రాసే ప్రతి ఫేక్ వార్తపై గట్టిగా స్పందించేలా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.