బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు పాకిస్తాన్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఎందుకంటే ఆయన బలూచిస్తాన్ గురించి మాట్లాడారు. బలూచిస్తాన్ స్వాతంత్రం గురించో లేకపోతే పాకిస్తాన్ చేస్తున్న అకృత్యాల గురించో మాట్లాడలేదు. సౌదీలో జరిగిన ఓ ఫిల్మీ ఈవెంట్ లో బలూచిస్తాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ నుంచి కూడా వచ్చి కష్టపడి పని చేసుకుంటున్నారని.. ఆయా ప్రాంతాల ప్రజల గురించి చెప్పారు.
సల్మాన్ ఖాన్ అలా చెప్పడమే.. పాకిస్తాన్ కు నచ్చడం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో భాగమని.. పాకిస్తాన్ తో పాటు బలూచిస్తాన్ అనే పేుర చెప్పడం వల్ల వేర్వేరు అన భావన వచ్చిందని.. తమ దేశాన్ని విడగొట్టే ఆలోచనతోనే ఇలా చెప్పారని పాకిస్తాన్ మండిపడుతోంది. సల్మాన్ ఖాన్ ఆలోచనల్లో ఏముందో కానీ.. బలూచిస్తాన్ ప్రజలు చాలా కాలంగా సొంత దేశం కోసం పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. అందుకే సల్మాన్ స్టేట్మెంట్ను తమకు గుర్తింపుగా ప్రచారం చేసుకుంటున్నారు. దాని వల్ల పాకిస్తాన్ పాలకులకు మరింత ఆగ్రహం వస్తోంది.
కేవలం బలూచిస్తాన్ ను ప్రస్తావించారని సల్మాన్ ఖాన్ ను టెర్రరిస్టుగా ప్రకటించడం పాకిస్తాన్ .. భయానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆయన నిజంగా బలూచిస్తాన్ కు మద్దతు పలికితే ఏమవుతారో కానీ.. సల్మాన్ ఇలాంటి విషయాలపై ఎప్పుడూ వివాదాస్పదంగా మాట్లాడలేదు. కానీ పాకిస్తానే అలా తీసుకుని తొందరపడింది. దీని వల్ల సల్మాన్ కు వచ్చే నష్టమేం లేదు కానీ.. పాకిస్తాన్ తీరుపై మాత్రం మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది.