హీరోలు ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం మామూలే. అయితే కొంతమంది కథానాయికలూ అప్పుడప్పుడూ నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటుంటారు. కానీ వీళ్లలో సీరియస్ గా ప్రొడ్యూసర్లుగా మారిన వాళ్లు చాలా తక్కువ. ఆ విషయానికొస్తే లేరనే చెప్పాలి. సమంత కూడా ‘శుభం’తో నిర్మాతగా మారింది. ఇదోదే కాలక్షేపం కోసం తీస్తున్న సినిమా అని చాలామంది భావిస్తున్నారు. అయితే సమంత మాత్రం ప్రొడక్షన్ ని సీరియస్ గానే తీసుకొంటోంది. ఎలాంటి సినిమాలు తీయాలి? ఎవరితో చేయాలి? అనే విషయంలో సమంs ప్లానింగ్ బాగానే చేసుకొంటోంది. ‘శుభం’ తరవాత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది కూడా సమంత బ్యానర్లో నిర్మిస్తున్న సినిమానే. దీంతో పాటు యేడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలన్న ఆలోచనల్లో ఉందట సమంత. ప్రస్తుతానికైతే అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలన్న ఆలోచన అయితే ఇప్పటికి లేదు.
”నేనంత తెలివైన నిర్మాతను కాకపోవొచ్చు. డబ్బులు ఎక్కడ పెట్టాలి? ఎలాంటి చోట వినియోగించాలి? అనేవి పెద్దగా తెలీవు. కాకపోతే సినిమాలపై ప్రేమతో కచ్చితంగా మంచి ప్రాజెక్టే అందిస్తాను. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. పైగా నేనంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. వాళ్లు నా నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూస్తారు. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశా. అన్నింటికంటే ముఖ్యంగా నాకు నేనే పెద్ద విమర్శకురాల్ని. ఏదీ ఓ పట్టాన నచ్చదు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్నా” అని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో సమంత అతిథి పాత్ర కూడా చేసింది. చేసింది అనేకంటే చేయాల్సివచ్చింది అనడం బెటర్. ఈ విషయం సమంతనే చెప్పింది. ”ఈ సినిమాలో ఓ కామియో పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఎవర్నయినా తీసుకోవొచ్చు. ఇది నా తొలి సినిమా. ఎవర్నయినా ఫేవర్ అడగాలంటే అదోలా అనిపించింది. అందుకే నేనే చేసేశా” అని ముక్తాయించింది. ‘శుభం’ ఈనెల 9న విడుదల అవుతోంది. అదే రోజున సమంత నటించిన ‘మహానటి’ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ కూడా సమంతకు ఈ రోజున సినిమాని విడుదల చేసేందుకు స్ఫూర్తి ఇచ్చి ఉంటుంది.