సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు… కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ యువ మల్టీస్టారర్‌కి భలే మంచి రోజుతో ఆకట్టుకొన్న శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భవ్య ఆర్ట్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘శమంతకమణి’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. వినాయక చవితి పూజా మహిమల్లో శమంతకమణి ప్రస్తావన వస్తుంది. చవితినాడు చంద్రుడ్ని చూసిన శ్రీకృష్ణుడిపై నీలాపనిందలు పడడానికి కారణం.. ఈ మణే. పురాణాలు, ఇతిహాసాలు చదివిన వాళ్లకు.. శమంతకమణి మహిమలు తెలుసు. ఆ టైటిల్ ఈ సినిమాకి పెట్టారంటే… ఓ మణి చుట్టూ తిరిగే కథేమో అన్న అన్నమానాలు కలుగుతున్నాయి. భలే మంచి రోజులానే…దీన్ని కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. ఆదివారం ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. నలుగురు హీరోలున్నా… హీరోయిన్ మాత్రం ఒక్కర్తే ఉంటుందట. రెగ్యులర్ సినిమాలా నాలుగు పాటలు, మూడు ఫైట్లూ ఉండవని, ఈ సినిమా ఓ కొత్త పంథాలో సాగుతుందని, అది నచ్చే నలుగురు యువ హీరోలు కలసి నటించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. మరి ఈ శమంతకమణి ఎలా మెరుస్తుందో తెలియాలంటే.. ఇంకొంతకాలం ఆగాలి.