‘కోర్ట్’ సినిమా శివాజీలోని నటుడికి కొత్త జన్మ ఇచ్చింది. అంతకు ముందే ’90’ వెబ్ సిరీస్లో మధ్యతరగతి తండ్రిగా విజృంభించిన వైనం గుర్తుండే ఉంటుంది. ఈ విజయాలతో శివాజీ పేరు మార్మోగింది. చిన్న, మధ్యతరగతి సినిమాల్లో ఆయనకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఇదే జోష్ లో నిర్మాతగానూ ముందడుగు వేశారు. తన బ్యానర్ లో ‘సంప్రదాయిని.. సుద్దిని.. సుద్దపూసని’ అనే సినిమా రాబోతోంది. ఈటీవీ విన్ కోసం చేసిన ప్రయత్నం ఇది. శివాజీతో పాటుగా లయ ప్రధాన పాత్రధారి. ’90’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకొన్న చిచ్చర పిడుగు రోహన్ మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు.
టైటిల్ చూసి ఇదో సంప్రదాయబద్ధమైన సినిమా అనుకొంటే పొరపాటు చేసినట్టే. ఇదో క్రిమినల్ ఫ్యామిలీ కథ. భార్య, భర్త, పిల్లాడు.. అంతా దొంగ బ్యాచే. వీళ్లేం చేశారన్నదే అసలు కథ. 90, కోర్ట్ తో పోలిస్తే ఈసారి శివాజీ వెరైటీ పాత్ర పోషిస్తున్నాడనే అనిపిస్తోంది. లయ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `మిస్సమ్మ`, `శైలజా కృష్ణమూర్తి`, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కూడా ఈసారి కలిసొస్తుందని గట్టిగా నమ్ముతోంది చిత్రబృందం. ఈటీవీ విన్ లోనే ’90’ వెబ్ సిరీస్ శివాజీకి మంచి బ్రేక్ ఇచ్చింది. మరి.. ఈ సంప్రదాయ బద్ధమైన కుటుంబ కథా చిత్రం ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందో చూడాలి.