టాలెంట్ ఉండి.. సరైన విజయాలు లేని హీరోల్లో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటాడేమో? తన కథల సెలక్షన్ బాగుంటుంది. టైమ్ కి తగ్గట్టుగా ట్రెండీ సబ్జెక్టుల్ని ఎంచుకొంటాడు. కానీ.. ఎందుకనో విజయం వరించడం లేదు. ఈసారి హిట్టు కొట్టక తప్పని పరిస్థితుల్లో చేసిన సినిమా ‘సిగ్మా’. విజయ్ తనయుడు సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భారీ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ రోజు టీజర్ వచ్చింది.
”మంచోడు.. మహానుభావుడు.. చెడ్డోడు.. రాక్షసుడు.. చూసే నీ చూపుని బట్టి. ఇప్పుడు.. ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారతాను..” అనే డైలాగ్ ఈ టీజర్లో వినిపించింది. ఈ డైలాగ్ చుట్టూనే కథలో సంఘర్షణ, హీరో క్యారెక్టరైజేషన్ ఉన్నాయన్న సంగతి అర్థం అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ కథని మలిచారు. మేకింగ్ క్వాలిటీ ఆకట్టుకొంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన అందించిన బీజియం ఓ పాప్ సాంగ్ ని తలపించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రమిది. కాస్టింగ్ పరంగా, టెక్నీషియన్ల పరంగా క్రేజీగా అనిపిస్తోంది. రాజు సుందరం, సంపత్‌రాజ్, ఫరియా అబ్దుల్లా, కేథరిన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
New
