2026 వైపు చిత్రసీమ దూసుకుపోతోంది. జనవరి 1న కొన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే అందరి దృష్టీ సంక్రాంతి సీజన్‌పైనే. రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ…. ఈ పండక్కి వస్తున్నాయి. పండగ సినిమా అంటే ఓ క్రేజ్. పైగా ఇది.. సంక్రాంతి. వీటన్నింటిపైనా ప్రేక్షకులు ప్రత్యేకమైన దృష్టి సారించడం ఖాయం. అయితే ఈ పండగ సినిమాలు కొంతమంది కెరీర్‌కి చాలా అవసరం. ఈ సీజన్లో హిట్టు వాళ్ల ఖాతాలో పడడమే ధ్యేయంగా సినిమాలు చేశారు. తమ కెరీర్ పరుగులు తీయాలంటే ఇప్పుడు ఓ హిట్టు కొట్టడం… నిజంగా అత్యవసరం.
పండక్కి ముందొచ్చే సినిమా రాజాసాబ్. ఈ సినిమా హిట్టూ, ఫ్లాపులతో ప్రభాస్ కెరీర్ పెద్దగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ కొంతమందికి మాత్రం ఈ సినిమా చాలా కీలకం. ముఖ్యంగా దర్శకుడు మారుతికి. ‘పక్కా కమర్షియల్’ సినిమా మారుతిని బాగా నిరుత్సాహపరిచింది. పైగా ఓస్టార్ హీరోని హ్యాండిల్ చేసిన అనుభవం మారుతికి లేదు. పైగా ఇది ఆయన తొలి పాన్ ఇండియా సినిమా. అన్ని రకాలుగా మారుతి కెరీర్ ని ఎఫెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. కథానాయికల కెరీర్‌కూ ఈ సినిమా ముఖ్యమే. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవికా మోహనన్… వీళ్ల కెరీర్ టర్న్ అవ్వాలంటే రాజాసాబ్ తో హిట్టు కొట్టాల్సిందే. అన్నింటికీ మించి… పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ హిట్టు చాలా అవసరం. పీపుల్ మీడియా చాలా ఒడిదుడుకుల్లో వుంది. మిరాయ్తో ఓ హిట్టు దక్కినా అది కేవలం ఉపశమనం మాత్రమే. పాత బాకీలన్నీ తీరిపోవాలన్నా, ఈ సంస్థ గాడిలో పడాలన్నా రాజాసాబ్ విజయం సాధించి తీరాల్సిందే.
మన శంకర వర ప్రసాద్ పై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్… ఇలా వరుస పరాజయాలు చిరు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. మధ్యలో.. ‘వాల్తేరు వీరయ్య’ తెరిపి ఇచ్చింది. సంక్రాంతికి వచ్చిన ‘వీరయ్య’ చిరుకి అతి పెద్ద కమర్షియల్ హిట్ అందించాడు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిన్న సినిమాలు చేసుకొంటూ కెరీర్‌ని సెట్ చేసుకొంటున్న సంగీత దర్శకుడు భీమ్స్ కి మెగా స్టార్ తో పని చేసే అవకాశం ఇచ్చిన సినిమా ఇది. భీమ్స్ బిగ్ లీగ్ లోకి చేరాలంటే… ఈ కమర్షియల్ హిట్ అవసరం.
వరుస ఫ్లాపులతో కుదుపులకు లోనైంది శర్వానంద్ సినీ ప్రయాణం. కథల విషయంలో, కాంబినేషన్ల విషయంలో ఎంత కేర్ తీసుకొన్నా.. హిట్టు పడడం లేదు. తన ఆశలన్నీ ‘నారీ నారీ నడుమ మురారీ’పైనే. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు బాగా ఆడతాయి. అందుకే హడావుడిగా ఈ సినిమాని రంగంలోకి దించేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ శర్వా కెరీర్ హైవే ఎక్కుతుందేమో చూడాలి. రవితేజకు కూడా ఈ సీజన్ చాలా కీలకం. 2025లో కూడా రవితేజ హిట్టు కొట్టలేకపోయాడు. మరో ఫ్లాప్ తగిలితే.. కోలుకోవడం కష్టం. అందుకే ఈసారి ఆచి తూచి అడుగులేశాడు. మాస్ అంశాలన్నీ పక్కన పెట్టి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. అదే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. దర్శకుడు కిషోర్ తిరుమలకు హిట్టు కొట్టడానికి ఇదే మంచి ఛాన్స్. ఆయన గత చిత్రం ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’ అనుకొన్నంత స్థాయిలో ఆడలేదు. తన మార్క్ మళ్లీ వేయాలంటే ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. నిర్మాత నాగవంశీకి 2025 పెద్దగా కలిసి రాలేదు. తను ఆశలు పెట్టుకొన్న సినిమాలేవీ ఆడలేదు. ఇప్పుడు సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’ దింపుతున్నారు. తన కాన్ఫిడెన్స్ మళ్లీ చేజిక్కించుకోవాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి.
ఇలా.. ఈ సంక్రాంతి సీజన్ వీళ్లందరి కెరీర్‌నీ, వాళ్ల స్పీడునీ డిసైడ్ చేయబోతోంది. కొత్త యేడాది మంచి ఆరంభం దొరుకుతుందని, తమ కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్ వస్తుందని వీళ్లందరి ఆశ. ఆకాంక్ష. అది జరిగితే.. టాలీవుడ్ కు సంక్రాంతి శుభారంభం అందిస్తే.. అంతకంటే కావాల్సిందేముంది?
