2026 సంవత్సరానికి సంక్రాంతి సీజన్ రూపంలో కిక్ స్టార్ట్ దొరికింది. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ఓ సూపర్ హిట్టు కొట్టారు. తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఈ సంక్రాంతికి ఇదే పెద్ద హిట్. ఇక యువ హీరోలు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా విజయాల బాట పట్టారు. ఈ మూడు సినిమాలతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకొంది. 2025లో వరుస పరాభవాలకు ఈ సీజన్ బ్రేక్ వేసినట్టే. ఈ స్ఫూర్తి ఈ యేడాదంతా కొనసాగాలని చిత్రసీమ భావిస్తోంది.
ఈ మూడు సినిమాల విజయాల్ని ఓసారి విశ్లేషించుకొంటే ఓ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మూడింట్లోనూ పెద్ద కథలేం లేవు. అదిరిపోయే సెటప్పులు లేవు. కనీ వినీ ఎరుగని హీరోయిజం కనపడలేదు. ఉన్నదల్లా వినోదమే.. స్వచ్ఛమైన వినోదం. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే విషయం ఈ మూడు సినిమాల్లో కనిపించింది. అందుకే చాలా కాలం తరవాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకూ, ఓటీటీలకూ అతుక్కుపోయారు.. అనే బెంగని ఈ మూడు సినిమాలూ కాస్త తీర్చాయి. మంచి కంటెంట్ ఇస్తే, వాళ్లూ థియేటర్లకు వస్తారన్న భరోసా కలిగింది.
రాజాసాబ్ లో మిస్సయ్యింది కూడా ఆ వినోదమే. మారుతికి ఫన్ పండించడంలో మంచి కమాండ్ ఉంది. తను అలాంటి సీన్లు రాయగలడు కూడా. కానీ హారర్, ఫాంటసీ లాంటి జోడు గుర్రాల స్వారీలో వినోదాన్ని పక్కన పెట్టాడు. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా ఫన్ టోన్ లో సాగిన సినిమానే. కాకపోతే ఆ ఫన్ సరిపోలేదు. పైగా ఇంత హెవీ కాంపిటీషన్లో ఆనలేదు. అందుకే తక్కువ మార్కులు పడ్డాయి.
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల విజయాలు కథకులకు, దర్శకులకు ఓ రాంగ్ మెసేజీ ఇచ్చాయేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. స్టోరీ టెల్లింగ్ అంటే వరల్డ్ బిల్డుంగులు, సెట్లూ, భారీ సెటప్పులూ అనే భ్రమలో పడిపోయారు. రక్తం, హింస మరింత ఎక్కువైపోతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి సింపుల్ కథలూ చెప్పినా జనం చూస్తారన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అసలు సినిమాలకు ఎందుకు రావడం లేదు.. అనేది విశ్లేషించుకొంటే కచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి. జనం విరగబడే ఫన్ ఏం కోరుకోవడం లేదు. సరదాగా కాసేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి, తృప్తిగా ఆస్వాదిస్తే చాలు. ఈ పండగ సినిమాలు, వాటి విజయాలు చెప్పిన సంగతి అదే. ఫ్యామిలీ కథలు, ఎంటర్టైన్మెంట్స్ అనే జోనర్లు పక్కన పెట్టేసిన దర్శకులు ఇప్పుడు ఆ జోనర్ని తట్టిలేపాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమాలు ఆడాయా అంటే.. అదీ ఒట్టి మాటే. సంక్రాంతి సీజన్ అనేది ఓ బూస్టప్ మాత్రమే. అదో అడ్వాంటేజ్ మాత్రమే. ఏ సీజన్లో ఇలాంటి సినిమాలు వచ్చినా జనం చూస్తారు. పండగ కాబట్టి ఇంకాస్త ఎక్కువ చూస్తారు. పండక్కి వచ్చేవన్నీ వినోదాత్మక కథలే కాబట్టి, ఈసారి ఆ పప్పులేం ఉడకవు అనుకొన్నాంతా. కానీ.. ఈ జోనర్లో ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తామన్న భరోసాని ఇచ్చారు ప్రేక్షకులు. వినోదాత్మక సినిమాల కెపాసిటీ ఇదే. ఇక నుంచి సంక్రాంతి పండగ అనగానే ఫ్యామిలీ డ్రామాలు తప్పకుండా గుర్తొస్తాయి, 2027 కూడా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాలే వస్తాయేమో అనిపిస్తోంది. పండగ అని కాదు.. మధ్యమధ్యలోనైనా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే థియేటర్లని మర్చిపోతున్న ఓ వర్గాన్ని మళ్లీ ఇటు వైపు తరలించే శక్తి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాలకే ఉంది.
