Santhana Prapthirasthu Movie Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
చిన్న చిన్న కాన్సెప్టులతో సినిమాలు చేయడం అంత ఈజీ ఏం కాదు. కథనంలో దమ్ముండాలి. క్యారెక్టరైజేషన్లు కొత్తగా ఉండాలి. చెప్పాలనుకొన్న పాయింట్ కి దూరంగా వెళ్లకుండానే మిగిలిన అంశాల్ని చాలా తెలివిగా మేళవించాలి. అప్పుడే కాన్సెప్టులు కథలవుతాయి. కథలు సినిమాలుగా మారతాయి. ‘సంతాప ప్రాప్తిరస్తు’ కూడా కాన్సెప్టుని నమ్ముకొన్న కథే. మరి ఆ కాన్సెప్టు లో కథగా మారేంత దమ్ముందా, ఆ కథలోని మిగిలిన అంశాల మాటేంటి? బాలీవుడ్ లో రూపొందిన `విక్కీ డోనర్`కీ ఈ కథకూ ఉన్న లింకేంటి?
చైతన్య (విక్రాంత్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మనిషి, మనస్తత్వం కూడా సాఫ్టే. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. అమ్మాయిలంటే ఆమడ దూరం. అలాంటి చైతన్య.. కల్యాణి (చాందిని చౌదరి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. చైతన్య మంచితనం, మెతకతనం చూసి కల్యాణి కూడా ఇష్టపడుతుంది. కానీ కల్యాణి తండ్రి (మురళీధర్ గౌడ్)కి ఈ సంబంధం ఇష్టం ఉండదు. తనకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులంటేనే పెద్దగా నమ్మకం ఉండదు. తన కూతురికి ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. తండ్రి కాదన్నా సరే.. కల్యాణి చైతన్యనే పెళ్లి చేసుకొంటుంది. ఆరు నెలల తరవాత కల్యాణిని వెదుక్కొంటూ వస్తాడు తండ్రి. కూతురిపై కోపం తగ్గిందేమో అనుకొంటున్న తరుణంలో ఓ బాంబు విసురుతాడు. ‘వంద రోజుల్లోగా నిన్నూ నా కూతుర్నీ విడగొడతా..’ అని సవాల్ చేస్తాడు. మరోవైపు కల్యాణికి చిన్న పిల్లలంటే ఇష్టం. త్వరగా తల్లి కావాలని కలలు కంటుంది. ఆ సమయంలోనే చైతన్యలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్లు నిర్దారిస్తారు. ఈ నిజం కల్యాణికి తెలియకుండా చైతన్య ఎన్నిపాట్లు పడ్డాడు? మరో వైపు మామ విసిరిన ఛాలెంజ్ ని ఎలా స్వీకరించాడు? అనేదే మిగిలిన కథ.
బాలీవుడ్ లో పన్నెండేళ్ల క్రితం ‘విక్కీ డోనర్’ అనే సినిమా వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా కెరీర్ గతిని మార్చేసే విజయాన్ని అందించింది. ‘ఇలాంటి పాయింట్లు కూడా సినిమాగా తీయొచ్చు’ అనే భరోసా కలిగించాయి. ఆ తరవాత అలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చాలా జరిగాయి. ఇప్పుడు దాదాపుగా అదే పాయింట్ తో ‘సంతాన ప్రాప్తిరస్తు’ రూపొందించారు. ఈ కథలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి.. మామతో హీరో ఛాలెంజ్. మరోటి.. తన స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు. రెండింటికీ సమన్యాయం చేసే ప్రయత్నంలో దర్శకుడు ఏ పాయింట్ నీ నూటికి నూరుపాళలూ ఎఫెక్టీవ్ గా చూపించలేకపోయాడేమో అనిపిస్తోంది. మామా అల్లుళ్ల ఛాలెంజ్ పక్కన పెడితే సంతానం కోసం హీరో పడే అగచాట్లు కాస్త కొత్త పాయింట్. దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుండేది. టీజర్, ట్రైలర్, టైటిల్… ఇవన్నీ చూసి ఈ సినిమాలో దర్శకుడు చెప్పే పాయింట్ ఏమిటన్నది ముందే ప్రిపేర్ అయి వెళ్తాడు ప్రేక్షకుడు. కానీ సదరు పాయింట్ మొదలయ్యే సరికి సగం సినిమా అయిపోతుంది. దాంతో టైటిల్ కి సగమే జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ వస్తుంది.
తరుణ్ భాస్కర్ కి హీరో, హీరో ఫ్రెండ్ తమ కథ చెప్పడం దగ్గర్నుంచి ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా మొదలవుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే ఇది వరకు చాలా సినిమాల్లో చూసేశాం. కాకపోతే… తరుణ్ భాస్కర్ టైమింగ్, తెలంగాణ స్లాంగ్ లో తాను పలికే డైలాగులు, అభినవ్ గోమట్టం కామెడీ టైమింగ్ వల్ల… కాస్త ఫ్రెష్‌నెస్ వస్తుంది. హీరో – హీరోయిన్ల లవ్ స్టోరీ మాత్రం చాలా బోరింగ్ గా సాగుతుంది. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లడం చూసి, హీరోని ఆరాధించే హీరోయిన్.. ఆ తరవాత లవ్వూ.. ఇలాంటి ట్రాకులకు ఎప్పుడు బ్రేకులు వేస్తారో మన దర్శకులు?
మామ ఛాలెంజ్ తో ఇంట్రవెల్ పడుతుంది. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ ఎంట్రీతో ఇంకాస్త ఫన్ మొదలవుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల్లో దోపిడీలు ఎలా జరుగుతాయో ఆయా సన్నివేశాల్లో సెటైరికల్ గా చూపించారు. వాటితో ఈతరం రిలేట్ అవుతుంది. తాగుబోతు రమేష్ ఎపిసోడ్ అంతగా పేలలేదు. మధ్యమధ్యలో కామెడీ పండించడానికి దర్శకుడు ఏవేవో ప్రయత్నాలు చేశాడు. అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇలాంటి కథల్ని వీలైనంత ఎంటర్టైన్మెంట్ తో చెప్పడమే నయం. ఎమోషనల్, బ్రేకప్లూ, ఈగో క్లాషులూ వాటి జోలికి వెళ్తే కథనం భారంగా మారుతుంది. కూతుర్నీ అల్లుడ్ని విడగొట్టాలని చూడాలనే తండ్రి క్యారెక్టరైజేషన్, ఆ కాన్ఫ్లిక్ట్ పెద్దగా పండలేదు. ఈ విషయాల్లో దర్శకుడు కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండేది. కేవలం స్పెర్మ్ కౌంట్ పాయింట్ తోనే సినిమా తీస్తే.. విక్కీ డోనర్లా ఉందే అనేస్తారేమో అని దర్శకుడు భయపడి ఉంటాడు. దాంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వెతలు అనే మరో ట్రాక్ కూడా జోడించాడు. ఉపకథలు ఎక్కువై అసలు కథపై ఫోకస్ తగ్గింది.
విక్రాంత్ కి ఇది రెండో సినిమా. తొలి సినిమాతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డాడు. ఇంట్రావర్ట్ గా తన బాడీ లాంగ్వేజ్‌కి తగిన పాత్రని ఎంచుకొన్నాడు. చాందిని చౌదరి తన పాత్రలో చలాకీగా చేసుకొంటూ వెళ్లిపోయింది. తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మెప్పిస్తాడు. తన క్యారెక్టర్ లో ఉండే కన్సిస్టెన్సీ ఆకట్టుకొంటుంది. ఆఖరికి తన కాస్ట్యూమ్స్ కూడా ఒకేలా ఉంటాయి. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. అభినవ్ గోమట్టం వీలైనంత వరకూ బండిని లాంగించే ప్రయత్నం చేశాడు.
పాటలు గుర్తుపెట్టుకొనేంత లేవు. అజయ్ అరసడ అందించిన నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాలకు తగ్గట్టుగా హృద్యంగా సాగింది. ఎత్తుకొన్న పాయింట్ చాలా సున్నితమైనది. దాన్ని ఎక్కడా అసభ్యత లేకుండా చూపించగలిగాడు దర్శకుడు. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. రైటింగ్ పరంగా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సీన్లపై బాగా కసరత్తు చేయాల్సింది. విక్కీ డోనర్ సినిమా వచ్చి పుష్కరం దాటింది. ఇలాంటప్పుడు మళ్లీ అలాంటి కథతో ఓ సినిమా చేస్తున్నామంటే.. కథనంలో, పాత్రల చిత్రణలో వైవిధ్యం చూపించాల్సిందే. ఈ విషయంలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ కాస్త వెనకబడింది. అక్కడక్కడ కొన్ని నవ్వుల కోసం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమపై తాము వేసుకొనే సెటైర్ల కోసమైతే ఈ సినిమా చూడొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.25/5
